ఉంటే ఇలాంటి కలెక్టరే ఉండాలి...!
మధురై ప్రధాన రహదారి వెంట ఓ బుగ్గకారు మెల్లగా వెళుతోంది. అందులో కూర్చున్న కలెక్టర్ రోడ్డు మీద వస్తూపోతున్న వాహనాల వైపు చూస్తున్నారు. ఇంతలో "డ్రైవర్ కారు ఆపండి'' అన్నారు. ఏం జరిగిందోనన్న ఆత్రుతతో కలెక్టర్ వైపు చూశాడు డ్రైవర్. "సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బైక్ మీద వెళుతున్న ఆ యువకుణ్ణి వెంబడించు'' అన్నారాయన. క్షణాల్లో బైకు ముందు కారు ఆగింది. కలెక్టర్ కారులో నుంచి దిగి... "ఏంటయ్యా, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బండిని నడుపుతున్నావ్! చదువుకున్నోడిలా ఉన్నావ్ ట్రాఫిక్ రూల్స్ తెలియవా...'' అని మందలించి ఊరుకోలేదాయన.
"ఇరవై నాలుగ్గంటల్లో పది మొక్కలు నాటాలి నువ్వు. ఇదే నీకు పనిష్‌మెంట్'' అని ఆదేశించి కారులో వెళ్లిపోయారు కలెక్టర్. అది ఉత్తుత్తి ఆదేశం కాదు. ఆ యువకునితో 24 గంటలు గడవకముందే పది మొక్కలు నాటించి ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. తప్పుకు శిక్ష వేయడమే కాదు, అది కచ్చితంగా అమలయ్యే వరకు అధికారులను నిద్రపోనివ్వని ఆ కలెక్టర్ పేరు 'యు.సగాయం'. తమిళంలో సగాయం అంటే సహాయం అని అర్థం. అందుకేనేమో - 'మన జిల్లాకు కూడా ఇలాంటి కలెక్టర్ ఉంటే ఎంత బాగుంటుంది' అనుకునేలా సామాన్యుల హృదయాలను గెలుచుకున్న ఆయన తోటి కలెక్టర్లకే కాదు... ప్రభుత్వ అధికారులందరికీ స్ఫూర్తిదాయకం.
ఆచరణలో కూడా నయాపైసా ముట్టని ఈ కలెక్టర్... ఎక్కడ పనిచేస్తే అక్కడ ప్రజల మెప్పు పొందుతున్నారు కానీ, నేతలకు మాత్రం కంటగింపుగా మారుతున్నారు. లేకపోతే 20 ఏళ్ల సర్వీసులో 18 సార్లు ఎందుకు బదిలీ అవుతారు..? "నాకు తెలుసు, ఈ సీట్లో కూర్చుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో. బాధ్యతలు తీసుకున్న మొదటిరోజున నేను ఎలాగున్నానో ఈ రోజు కూడా అలాగే ఉన్నాను. అవినీతిని వ్యతిరేకించడం ఇప్పుడు ఫ్యాషనైపోయింది కానీ, నేను ఎప్పటి నుంచో ఆ సిద్ధాంతాన్నే అనుసరిస్తున్నాను'' అంటాడాయన.
బ్యాంకు బ్యాలెన్సు ఏడువేలే!
అధికారులంతా అవినీతిపరులైపోతున్నారు.. ఈ దేశాన్ని ఇంకెవరు కాపాడతారని ఆందోళన చెందుతున్న వారికి ఇటీవల మొదలైన 'ఆస్తుల ప్రకటన' కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. రెండేళ్ల కిందట నమక్కల్ జిల్లాకు కలెక్టర్‌గా ఉన్నప్పుడు సగాయం స్వచ్ఛందంగానే ఆస్తుల్ని ప్రకటించి సంచలనం సృష్టించారు. అప్పుడు ఆయన బ్యాంకు బ్యాలెన్సు కేవలం రూ.7,172, మధురైలో తొమ్మిది లక్షలు విలువ చేసే ఇల్లు.. ఇవే సగాయం ఆస్తిపాస్తులు.
పత్రికల ద్వారా విషయం తెలుసుకుని- తమిళనాడులో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఒకసారి సగాయం కూతురు 'యాలిని'కి జబ్బు చేసింది. ఆస్పత్రిలో చేర్పించాలి. ఊపిరి తీసుకోవడానికే కష్టపడుతుంటే దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది అయిదు వేల రూపాయలు కడితేనే అడ్మిట్ చేసుకుంటామన్నారు. సమయానికి అయిదు వేల రూపాయలు లేక ఎన్ని తిప్పలు పడ్డారో సగాయం. ఆ సమయంలో ఆయన ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ కమిషనర్. కాసులు కురిపించే కామధేనువు ఆ శాఖ.
అలాంటి చోట పనిచేసే సగాయం దగ్గర 'అయిదువేలు' లేవంటే అందరూ విస్తుపోయారు. సంఘటనకు ముందే 650 వైన్‌షాపులకు అనుమతులను కూడా మంజూరు చేశారాయన. మధురై పట్టణాన్ని అద్దంలా ఉంచాలన్నది సగాయం లక్ష్యం. అనుకున్నదే తడవు వీధుల్లో పడ్డారు. బస్టాండు మొత్తం చిరు వ్యాపారుల కూడలైపోయి ప్రయాణీకులు కూర్చునేందుకు కాసింత జాగా లేదు. వారం రోజుల్లో ఆ ఆక్రమణలన్నీ తొలగించారు. "ఆయన జీవితంలో పైసా లంచం తీసుకున్నట్లు వినలేదు నేను. ఎంతోమంది హీరోలను చేసి సినిమాలు తీస్తుంటారు. నిజంగా హీరో అంటే ఈ కలెక్టరే..'' అంటున్నారు తమిళులు.
ఎక్కడున్నా ఒకే పాలన..
మధురై కలెక్టర్ కాక మునుపు కాంచీపురం రెవెన్యూ ఆఫీసర్‌గా చేశారు సగాయం. సీట్లో కూర్చున్న వెంటనే ఇసుక మాఫియా మీద పడ్డారు. అప్పటికే పాలార్ నదిలోని ఇసుకనంతా తోడేశారు కాంట్రాక్టర్లు. ఎలాంటి రెవెన్యూ ఆఫీసర్‌నైనా వాళ్లు డబ్బుతో కొనేసేవారు. లేదంటే ఎమ్మెల్యే, ఎంపీలతో ఫోన్లు చేయించి బెదిరించేవారు. కానీ, సగాయం వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. 'అనుమతిలేకుండా ఇసుక తోడేస్తే తోలు తీస్తా'నన్నారు. దాంతో ఇసుక మాఫియా పరారైపోయింది. ఒకసారి- ఓ వినియోగదారుడు కూల్‌డ్రింక్‌ను చేతిలో పట్టుకుని సగాయం దగ్గరికి వచ్చాడు.
మట్టితో అపరిశుభ్రంగా ఉన్న ఆ కూల్‌డ్రింకును చూపిస్తూ.. ఫిర్యాదు చేశాడు. అప్పటికప్పుడు విచారణకు ఆదేశించారు సగాయం. వాస్తవాలు బయటపడ్డాయి. ఆ కూల్‌డ్రింక్ ఉత్పత్తి యూనిట్‌ను మూయించేదాక ఊరుకోలేదాయన. కొన్ని రోజుల పాటు అమ్మకాలను కూడా నిషేధించారు. కూల్‌డ్రింక్ కంపెనీ బహుళజాతి సంస్థ కావడంతో ఎంత మందితో కావాలో అంతమందితో చెప్పించినా సగాయం లెక్కచేయలేదు. చెన్నైలో పనిచేస్తున్నప్పుడు కూడా ఒక రెస్టారెంట్ కేసులో రూ.200 కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమిని రికవరీ చేసి చరిత్ర సృష్టించారు.
కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం సగాయం చేపట్టే 'దర్బార్'కు కుప్పలుతెప్పలు ఫిర్యాదులు వస్తుంటాయి. వాటిని సంబంధిత అధికారులకు పంపి చేతులు దులుపుకునే రకం కాదు సగాయం. పగలురాత్రి తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు దాడులు చేయడం ఆయన నైజం. ఒక్కోసారి రోడ్డు మీద వెళుతున్న స్కూలు బస్సులను ఆపేసి.. అందులోకి ఎక్కేస్తారు. పిల్లలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తనే స్వయంగా అడిగి తెలుసుకుంటారు.
'సార్, మేము కూడా మీలాగే ఐఏఎస్ ఆఫీసర్ అవుతాం' అన్నారట ఓ సందర్భంలో పిల్లలు. "జీవితాంతం లంచం తీసుకోకుండా పనిచేయగలమనుకుంటేనే మీరు ఐఏఎస్‌లు కండి. లేదంటే ఇటురాకండి..'' అని చెప్పారట. "ఈ దేశానికి పట్టుగొమ్మలు పల్లెలే''నని చెప్పిన మహాత్మాగాంధీని ఆరాధిస్తారు సగాయం. గాంధీ భావాలను ఆచరణలో అమలు చేసి చూపిస్తారు. కేవలం పల్లెలను సందర్శించడానికే ప్రత్యేక సమయం కేటాయిస్తారు. విశేషమేమిటంటే- అధికారులకు ముందస్తు సమాచారమేదీ ఇవ్వకుండా పల్లెల్లో దిగిపోతారు. గ్రామాల అభివృద్ధిని పట్టించుకోని వీఏవో (విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్)ల భరతం పడతారు. మొత్తంగా వీఏవోల వ్యవస్థనే ప్రక్షాళనం చేశారు.
దీంతో- "నిత్యం తనిఖీలు చేస్తూ.. నిద్రపట్టకుండా చేస్తున్న ఈ కలెక్టర్‌ను బదిలీ చేయాలి'' అంటూ వీఏవోలంతా ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు. అయితే వందలాది గ్రామాల ప్రజలు వీఏవోల తీరును వ్యతిరేకించారు. కలెక్టర్ బదిలీ కాకుండా ఆందోళనలు చేపట్టారు. ఇదీ సగాయంకున్న పేరు. ప్రస్తుతం అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమం చేస్తున్నట్లే.. ఉద్యోగరూపంలో పోరాటం చేస్తున్న కలెక్టర్ సగాయం. ఇలాంటి వాళ్లే ఈ దేశానికి ఆశాదీపాలు.
- కరప్షన్ వార్
ఈ స్టోరీ మీరు ఎందుకు చదవాలంటే...
ఒక్కసారి ఐఏఎస్ అయితే చాలు. మూడుతరాలకు సరిపోయే ఆస్తిపాస్తులు వెనకేసుకోవచ్చన్న అపప్రధ మూటగట్టుకుంటున్నారు ఇప్పటి అధికారులు. ఇటీవల పట్టుబడ్డ మధ్యప్రదేశ్‌లోని ఓ ఐఏఎస్ దంపతుల అక్రమార్జన ఎంతో తెలుసా? అక్షరాలా రూ.350 కోట్లు. మూడు నగరాల్లో మరో 25 ప్లాట్లు వారి పేరు మీద ఉన్నట్లు కూడా వెల్లడయింది. మీరు చదువుతున్న కలెక్టర్ సగాయం బ్యాంకు బ్యాలెన్సు ఎంతో తెలుసా..? కేవలం 7,172 రూపాయలు. ఇంత నిజాయితీ కలిగిన అధికారి 18 సార్లు ఎందుకు బదిలీ అయ్యారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాలి.