దేశ
రాష్ట్రపతి పదవిని అలంకరించిన తొలి మహిళ ప్రతిభా దేవీసింగ్ పాటిల్.
సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన పెద్ద వయస్కురాలు కూడా ఆమే.
రాష్ట్రపతిగా 24 సార్లు విదేశాల్లో పర్యటించిన ఘనత కూడా ఆమెకే దక్కింది.
12వ రాష్ట్రపతి అయిన ఆమె పదవీ కాలం రేపటితో (జూలై 25) ముగియనుండటంతో నిన్న
(23న) పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఘనంగా
వీడ్కోలు పలికారు.
ప్రతిభా పాటిల్ 1934 డిసెంబర్ 19న మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలోని నంద్ గావ్ గ్రామంలో జన్మించారు. జల్‌గావ్ లో ఆమె రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. బాంబే లా కాలేజ్ నుంచి లా డిగ్రీ పొందారు. క్రీడల్లో ఆమెకు బాగా ఆసక్తి కనబరిచేవారు. టేబుల్ టెన్నిస్‌లో ఆమె చాలా అవార్డులు కూడా గెలుచుకున్నారు.
జల్‌గావ్
జిల్లా కోర్టులో న్యాయవాదిగా ఆమె తన ప్రాక్టీస్ ప్రారంభించారు. పేద మహిళల
సమస్యలు తీర్చడంలో ఆమె ముందుండేవారు. 27 ఏళ్ళ వయస్సులోనే ఆమె మహారాష్ట్ర
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. 1985 వరకూ ముక్తాయ్ నగర్ నియోజకవర్గం
నుంచి ఎమ్మెల్యేగా వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. 1985 నుంచీ 90 వరకూ
ఆమె రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. 1991లో పదో లోక్‌సభకు అమ్రావతి నుంచి
ఎన్నికయ్యారు. 1967 నుంచీ 80 వరకూ మహారాష్ట్ర ప్రభుత్వంలో వివిద మంత్రి
పదవులు అధిష్టించారు. 1979 జూలై నుంచి 1980 ఫిబ్రవరి వరకు ఆమె మహారాష్ట్ర
శాసనసభలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. 1986 నుంచీ 88 వరకూ రాజ్యసభలో
డిప్యూటీ చైర్ పర్సన్‌గా కొనసాగారు. 1988 నుంచీ 90 వరకూ మహారాష్ట్ర
పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.
2007
జులై 25న రాష్ట్రపతిగా ఎన్నికయ్యే ముందు ఆమె రాజస్థాన్‌కు గవర్నర్‌గా
పనిచేశారు. ఆ నాటి యూపిఏ రాష్ట్రపతి అభ్యర్ధి ప్రతిభాపాటిల్‌కు వామపక్షాలు
కూడా మద్దతు పలికాయి. ఎన్‌డిఏ భాగస్వామ్యపక్షం శివసేన కూడా మరాఠా వాదం
పేరుతో ఆమెకే మద్దతిచ్చింది. దీంతో ఆమె ఎన్‌డిఏ అభ్యర్ధి, నాటి
ఉపరాష్ట్రపతి బైరాన్‌సింగ్ షెకావత్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు.
రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. రాష్ట్రపతిగా
ఐదేళ్ళ పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రతిభాపాటిల్ తన హయాంలో 24 సార్లు
విదేశీ పర్యటనలు చేశారు. దేశ విదేశాల్లో భారత వాణిని బలంగా వినిపించారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకున్న ఆమె సుఖోయ్ యుద్ధ
విమానంలో 30 నిమిషాల పాటు ప్రయాణించి రికార్డు సృష్టించారు. ఇలా సుఖోయ్‌లో
ప్రయాణించిన పెద్ద వయస్కురాలు కూడా ప్రతిభాపాటిలే కావడం విశేషం.
తమ
పదవీకాలంలో ప్రతిభా పాటిల్ 35 మంది ఖైదీల మరణశిక్షను జీవిత కాల శిక్షగా
మార్చారు. ప్రతిభాపాటిల్ పదవిలో ఉండగానే ఆమె భర్త దేవీసింగ్ రాణీసింగ్
షెకావత్‌పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. మహారాష్ట్రలోని పూణేలో రక్షణశాఖకు
చెందిన భూమిని కారుచౌకగా పొందాలని చూశారని ప్రతిభ కుటుంబసభ్యులపై ఆరోపణలు
వచ్చాయి. ఆ తర్వాత ఆమె ఆ భూమిని తీసుకోరాదని కూడా నిర్ణయించుకున్నారు.
మహారాష్ట్రలో ఇటీవలి ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే అయిన ప్రతిభ తనయుడి
కారులో పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం సంచలనం సృష్టించింది. రిటైర్‌మెంట్
తర్వాత ప్రతిభాపాటిల్ ఢిల్లీలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ
నివాసానికి పక్కనే ఉన్న భవనంలోకి మారనున్నారు.