ఏది నీది? ఏది కానిది?
ఆస్తి, అధికారం, అందం...
ఇవన్నీ తనవే, అన్నీ తనకే అనుకుంటాడు మానవుడు. అందుకే ఈ స్వార్థం, గర్వం, మోహం. కానీ, నీది అనుకుంటున్న దంతా మాయ అంటారు జగద్గురు ఆది శంకరాచార్య! అయితే ఏదీ నాది కానప్పుడు ఇక నేనెందుకు అన్న నిస్తేజం మనిషిని ఆవరించదా?
అందుకు ఆయన చూపిన పరిష్కారం - నువ్వే బ్రహ్మ, నువ్వే సత్యం అని!
ఏమిటీ అద్వైతం? బొమ్మలు వేరే కాని వాటిలోని మట్టి ఒకటే. ఆకారాలు వేరే కాని మనుషులంతా ఒకటే. అదే అద్వైతం. అదే జగద్గురువు సిద్ధాంతం.
కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలడి గ్రామం.
క్రీ.శ. 788. వైశాఖమాసం. శుక్లపక్ష పంచమి మధ్యాహ్నం. నంబూద్రి బ్రాహ్మణ ఇంట శంకరుడి జననం. నాలుగేళ్లకే - తండ్రి శివగురు మరణం. తల్లి ఆర్యాంబ అన్నీ తానై పెంచింది. 5వ ఏట ఉపనయనం జరిపించింది. స్వతహాగా తీక్షణబుద్ధి, తార్కికత, ఏకాగ్రత ఎక్కువ ఆ పిల్లాడిలో! అందుకే వేదం, తర్కం, సాంఖ్యం, యోగం... నేర్చేసుకున్నాడు.
అన్నీ అభ్యసించాక ‘అసలు ఏది సత్యం’ అన్న శంక మొదలైంది శంకరుడిలో. సిసలైన వైదిక తత్వం గాడి తప్పిందని పసిగ ట్టాడు. సన్యాసం తీసుకుని అసలైన జ్ఞానదీపాన్ని దేశమంతా వెలిగించాలని ఉవ్విళ్లూరాడు. కాని తల్లి ససేమిరా అంది.
ఓ రోజు శంకరుడు పెరియార్ నదిలో స్నానం చేస్తున్నాడు. అంతలో ఓ మొసలి అతడి కాలు పట్టుకుంది. బతికి బట్టకట్టడం కష్టమని తేలిపోయింది. ఇంతలో రొప్పుతూ పరుగున తల్లి వచ్చింది. ఆమెను చూస్తూనే మునిగిపోతున్న శంకరుడు- ‘‘అమ్మా.. ఇప్పుడైనా సన్యాసం తీసుకోనివ్వమ్మా’’అని అభ్యర్థించాడు. శోకిస్తూనే ఆమె సరేనంది.
నేరుగా పయనమై నర్మదా తీరం చేరాడు శంకరుడు. అక్కడ గోవింద భగవత్పాదుడనే యోగికి శిష్యుడయ్యాడు. శంకరుడు సన్యాస దీక్ష పొందింది ఆయన దగ్గరే! శాస్త్ర రహస్యాలెన్నో తెలుసుకున్నదిక్కడే! శంకరుడిలో వేదాంత శక్తి ఉద్దీప్తమైందిప్పుడే! లక్ష్యం స్పష్టమైంది అప్పుడే!
ఆపై కాశీ వెళ్లి వేదాంత గ్రంథాల్ని ఔపాసనం పట్టాడు. దాంతో శంకరుడి తత్త్వశాస్త్రం పరిపూర్ణమైంది. అయితే ఓ రోజు శంకరుడికి ఓ పంచముడు ఎదురయ్యాడు. తప్పుకోమన్నాడు శంకరుడు. ‘‘ఎవరిని తొలగమంటున్నావు? నా శరీరాన్నా? నా ఆత్మనా?’’ అని ప్రశ్నించాడా పంచముడు.
శంకరుడు సిగ్గుపడ్డాడు. ఉపన్యాసాలకు మాత్రమే పరిమితమయ్యే సిద్ధాంతం వాసన లేని పువ్వని తెలుసుకున్నాడు. ఆత్మతత్వపు ఏకత్వాన్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నాడు. ఆ పంచముడికి నమస్కరించి ‘‘మనీషా పంచ క’’ శ్లోకాల్ని ఆశువుగా చెప్పాడు.
జ్ఞానానికి ఇప్పుడు అనుభవం తోడైంది- నారుకి నీరులా! తనకన్న ముందే గురువులు ఉపదేశించిన అద్వైత సిద్ధాంతపు అసలైన సారాన్ని ఆత్మతో గ్రహించాడు శంకరుడు.
అప్పుడు బోధనలు ప్రారంభించాడు. అందుకు కాశీలోని మణికర్ణికా ఘట్టంలోని ముక్తిమండలం వేదికైంది. పండితులు, మఠాధిపతులు, తాత్త్వికులు... శంకరునితో చర్చకు దిగారు. కానీ ఓడారు. వారంతా శంకరుని శిష్యులయ్యారు.
శంకరులవారు కాశీనుంచి బద్రీనాథ్, ప్రయాగ, బీహార్‌లోని మాహిష్మతీ నగరం వెళ్లారు. క్రతువులే మతమంటూ వితండంగా వాదించే మండనమిశ్రుడులాంటి వారితో తర్కించారు. ఒట్టి కర్మకాండ వల్ల మూఢభక్తి పెచ్చరిల్లుతుందని ఆదిశంకరులు విస్పష్టం చేశారు. మండన మిశ్రుడులాంటివారు శంకరులకు శిష్యులయ్యారు.
ఆపై- శ్రీశైలం, గోకర్ణం, మూకాంబికా క్షేత్రం పర్యటించారు. అద్వైత వేదాంత తత్త్వ పరివ్యాప్తికై శృంగేరిలో తొలిపీఠం స్థాపించారు. అంతలో తల్లికి అనారోగ్యమంటూ కబురొచ్చింది. హుటాహుటిన కాలడి వెళ్లారు. కడసారిగా కొడుకుని చూసుకుని ఆమె ఆనందించింది. ఆపై కన్నుమూసింది. సన్యాసికి కర్మాధికారం లేదు. బంధువులు వారించారు. అయినా కన్నతల్లికి తానే అగ్ని సంస్కారాలు నిర్వహించారు.
సన్యాసి అంటే భవబంధాల్ని తెంచుకోవడమే. కానీ మానవీయ స్పర్శను కోల్పోడం కాదు. మాతృరుణం తీర్చుకుని మాతృదేశ సేవకై తిరిగి యాత్ర ప్రారంభించారు శంకరాచార్య. రామేశ్వరం, కంచి, తిరుపతి, ద్వారక, ఉజ్జయిని, అస్సాం, పూరి, కాశ్మీర్... ఇలా తిరుగని ప్రాంతం లేదు; క్రీ.శ. 820లో కేదారనాథ్‌లో 32వ ఏట పరమపదించేంతవరకు అద్వైత వాణిని వినిపించని క్షేత్రం లేదు.
నిండా 30 ఏళ్లు నిండని యువకుడికి ... స్వార్థపు వెంపర్లాట కాకుండా కొండలు, కోనలు, నదులు, పల్లెలు... దాటి దాటి... భారతదేశం ప్రతి మట్టి అణువునూ స్పృశించి ప్రతి భారతీయుడి గుండెల్లోనూ వేదాంత భేరి మోగించాలన్న తపన దేనికి?
ఎందుకంటే...
క్రీ.శ. 8వ శతాబ్ది భారత్‌కు సంధికాలం. దేశమంతా అనైక్యత, అస్థిరత. ఆధ్యాత్మిక శక్తి ఉన్నా కావలసినంత అజ్ఞానం. వైదిక మతం, అందులోంచి శైవవైష్ణవాలంటూ అనేక శాఖలు, తిరిగి ఆ శాఖల్లో శాక్తేయం, పాశుపతం, కాపాలికం, పాంచరాత్రం, సౌరం అంటూ చెప్పలేనన్ని చీలికలు; వైదిక ధర్మాల్ని వ్యతిరేకించే బౌద్ధజైనాలు, మళ్లీ వాటిలో అనేక పీలికలూ... ఇదీ పరిస్థితి.
వీటికి తోడు ... ఇతర మతాల ప్రవాహం. ఇస్లాం భారత్‌లోకి తొలుత ప్రవేశించింది కేరళలోకి- క్రీ.శ. 629లో. తొలి భారత ముస్లిం రామవర్మ కులశేఖర కేరళలోని కొడంగల్లూర్‌లో మసీదు కట్టించిందప్పుడే!
భారత్‌లోకి క్రైస్తవం ప్రవేశించింది క్రీ.శ. 52లో. క్రీస్తు శిష్యుడైన సెయింట్ థామస్ తొలుత అడుగిడింది - కేరళలోని ముజిరిస్ గ్రామంలో! ఆ కొడంగల్లూర్, ముజిరిస్ గ్రామాల చేరువలో ఉన్నదే కాలడి. ఈ నేపథ్యంతో సాగింది శంకరుడి బాల్యం.
పాయలుగా విడిపోయిన మతాలు, తాత్వికత ఛిన్నాభిన్నమైన తీరు ఆయన మదిని కదిలించాయి. వేదాల్లోని ఏవో కొన్ని శ్లోకాల్ని విడదీసి వాటికి కావలసిన అర్థాలనో, అపార్థాలనో కల్పించి ఎవరి వ్యాఖ్యానాలు వారు చేస్తూ, ఇతర శాఖలపై అసహనంతో ప్రత్యక్షదాడులు చేస్తూ సాగుతున్న ముఠాలపోరు శంకరుడి గుండెను కలచి వేసింది.
కర్మకాండలు, ఆత్మశుద్ధి లేని ఆచారాలు, భ్రష్టాచారాలు, వెర్రితలలు వేసిన తంత్రవిద్యలు, జుగుప్సను కలిగించే మల్లరి పూజలు, భైరవ పూజలు, నరబలులు, భోగలాలసత, అనైతికత, బాహ్యాడంబరాల పట్ల ఆసక్తి, భౌతిక వస్తువులే శాశ్వతమన్న భ్రమ... ఇవన్నీ దేశీయుల్లో నాటుకుపోవడాన్ని చూశారాయన. ఆత్మ ఎన్నో మందపు ఇనప పొరల కింద కొన ఊపిరితో రెపరెపలాడడాన్ని గమనించారాయన.
అలాంటి పరిస్థితిలో - అన్ని సిద్ధాంతాల్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సత్యం ఒక్కటే అని చాటి చెప్పేందుకు వేల మైళ్ల పాదయాత్ర చేయడమే శంకర విజయం. కంటికి కనపడేదే నిజమనుకుని అది తప్ప ఇంకొకటి లేదని భ్రమించి, ఈ ప్రపంచాన్ని ముక్కలుగా, వైరుధ్యాలుగా జమకట్టే తత్త్వాన్ని నిర్దంద్వంగా ఖండించి... వివేకబుద్ధి నేర్పిన జ్ఞానమూర్తి శంకరాచార్య.
కుమతాల్ని, విమతాల్ని, మూఢాచారాల్ని దౌర్జన్యంతో కాక తార్కికతతో వాక్పటిమతో ఎదుర్కోగలగడమే శంకరుల వ్యక్తిత్వం! ఆయన శైవ, వైష్ణవ, బౌద్ధ... ప్రాంతాల్ని పర్యటించడానికి కారణమిదే. ఓ ప్రాంతపు పీఠానికి మరో ప్రాంతపు శిష్యుడిని నియమించడానికి నేపథ్యమిదే.
మనిషి అంతరంగం దృఢంగా ఉంటే అతని బాహ్యప్రపంచం శక్తిమంతమవుతుంది. అందుకే ఆయన మానసిక దౌర్బల్యాన్ని నిరసించారు. ‘‘నారీస్తన భార వాభీదేశం...’’ అనే శ్లోకంలో ‘‘వక్షోజభారాన్ని మోస్తున్న స్త్రీ నాభిని చూసి మోహం చెందకు. అది కేవలం మాంసవసాది వికారమే’’ అని కుండబద్దలు కొట్టారు. ‘‘సత్సంగత్వే నిస్సంగత్వం...’’ అంటూ దేనిమీదా మోహం లేకపోతే మనసు వజ్రమవుతుందన్నారు.
దీపాన్ని చూపించడానికి మరోదీపం అవసరం లేదు. నిజానికి ఆ దీపమే అన్నింటినీ చూపిస్తుంది. శుద్ధ చైతన్యం కూడా అలాంటిదే! దాన్ని తట్టిలేపడమెలాగో నేర్పారు శంకరులు. దానికి నీ- నా భేదం వచ్చిందీ అంటే అది అజ్ఞానం.
నదిలో కుండ ఉంది. దానికి లోపలా, వెలుపలా నీళ్లుంటాయి. అటూ ఇటూ ఉన్న నీళ్లు వేరు కాదు. కుండ ఉన్నంత వరకే భేదం. అదే మాయ. తాడుని పామనుకునేంత భ్రాంతి. కుండ పగిలితే ఏమీ లేదు. అంతా ఒకటే. ఈ మనిషి, ఈ దేహం, ఈ స్వపర భేదం, నాదీ నీదీ అనుకునే వెర్రితనం, అహంకారం... అంతా ఆ కుండలాంటిదే!
కుండ అస్తిత్వాన్ని గుర్తించడం జ్ఞానం. అది ఏనాటికైనా కరగక తప్పదని తెలుసుకోవడం అసలైన జ్ఞానం. ఇదే శంకర తత్త్వం.
‘‘అంగం గలితం పలితం ముండం...’’ అనే భజగోవింద శ్లోకంలో చెప్పినట్లు ‘శరీరం ముసలిదైపోయింది. పళ్లు ఊడిపోయాయి. రేపో మాపో చావు. అయినా కోరికల్ని వదిలిపెట్టని అజ్ఞాని మానవుడు’
జ్ఞానానికి అటా ఇటా తేల్చుకోవాల్సింది మనమే!
....
--
No comments:
Post a Comment