Monday, 30 January 2012

అతి చార్జింగ్ అనర్థదాయకం - దీపావళి టపాసుల్లా పేలుతున్న మొబైల్స్

'మొబైల్' బాంబులు
దీపావళి టపాసుల్లా పేలుతున్న మొబైల్స్
చైనా పీసులతోనే అధిక ముప్పు
అతి చార్జింగ్ అనర్థదాయకం. 

ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడుతూ గృహిణి మృతి.. జేబులోనే సెల్‌ఫోన్ పేలి వృద్ధుడి దుర్మరణం.. దాదాపు రోజూ పేపర్లలో ఇలాంటి వార్తలే! అంటే.. ఫోన్ల పేరుతో జేబులో బాంబులు పెట్టుకుని తిరుగుతున్నామా? ఫోన్లు ఎందుకిలా దీపావళి బాంబుల్లా పేలుతున్నాయి? ఈ ముప్పు నుంచి తప్పించుకోవడం ఎలా? 

..తమ సూచనలను పాటిస్తే ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని సాంకేతికనిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే.. 
+ తక్కువ ధరకు దొరుకుతాయన్న ఉద్దేశంతో చాలా మంది చైనా ఫోన్లను కొనుగోలు చేస్తారు. సాధారణంగా వాటిలో వాడే నాసిరకం బ్యాటరీలే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతాయి. నాణ్యతగల బ్యాటరీలను వాడినప్పుడు పేలుడు ముప్పు చాలా తక్కువ. 

+ బ్రాండెడ్ ఫోన్లతో పాటు వచ్చే బ్యాటరీలు పూర్తిగా డెడ్ అయినప్పుడు మళ్లీ అదే కంపెనీ అవుట్‌లెట్లలో దొరికే ఒరిజినల్ బ్యాటరీలను కొని వేసుకోవాలి. అంతే తప్ప ఖర్చు తక్కువ కదా అనే ఉద్దేశంతో స్థానికంగా తయారయ్యే బ్యాటరీలను పొరపాటున కూడా కొనొద్దు. అలాంటివాటిలో నకిలీ బ్యాటరీలు కూడా ఉండే ప్రమాదం ఉంది. 

+ బ్రాండెడ్ ఫోన్ చార్జర్ పాడైనప్పుడు కొద్దిగా ధర ఎక్కువైనా సరే, మళ్లీ అదే చార్జర్ అదే కంపెనీ అవుట్‌లెట్‌లో కొనుగోలు చేయాలి. రూ.100-200కి దొరుకుతాయి కదాని ఊరూపేరూ లేని చార్జర్లను కొనుగోలు చేయవద్దు. అవి బ్యాటరీలను పూర్తిస్థాయిలో చార్జ్ చేయలేవు.

+ టార్చ్‌లైట్లలోనూ రిమోట్ కంట్రోళ్లలోనూ వాడే ఆల్కలీన్ (ఏఏ, ఏఏఏ) బ్యాటరీలతో పోలిస్తే.. సెల్‌ఫోన్లలో ఉండే లిథియం అయాన్ బ్యాటరీలు అత్యంత శక్తిమంతమైనవి. వాటితో ఆటలాడటం ప్రమాదకరం. ఆ బ్యాటరీలను బయటికి తీసినప్పుడు నగలు, నాణేల వంటి వాటితో వాటిపై గీయడం వంటివి చేయకూడదు. వాటిని ఎక్కువ వేడి ఉండేచోట.. అంటే గ్యాస్ స్టవ్ గట్టు మీద, హీటర్లు, పొయ్యిలకు దగ్గరగా పెట్టడం ప్రమాదహేతువు. 

+ పనికిరాని బ్యాటరీలను మీ చేతులతో మీరే నాశనం చేయాలనుకోవద్దు. కొందరు వాటిని రాయితో కొట్టడం, మంటల్లో పడేయటం వంటివి చేస్తారు. అలాంటి పని అస్సలు చేయకూడదు. ఇటీవలికాలంలో ప్రముఖ ఫోన్ తయారీ కంపెనీలు పాత ఫోన్లను పారేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మీ ఫోన్, బ్యాటరీ, చార్జర్ వంటివి పాడైపోతే అక్కడికి తీసుకెళ్లి వారు ఏర్పాటు చేసిన బిన్‌లలో వేయండి. 

+ ఫోన్ పొరపాటున నీళ్లలో పడితే కొందరు తుడిచి, మళ్లీ చార్జింగ్ పెడతారు. ఇది చాలా ప్రమాదకరం. తడిసిన ఫోన్‌లోంచి బ్యాటరీని తీసి, ఫోన్‌నూ బ్యాటరీనీ పొడిబట్టతో శుభ్రంగా తుడిచి నీడలో ఆరబెట్టండి. పూర్తిగా ఆరినట్టు అనిపించకపోతే స్థానికంగా ఉండే సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లండి. వారు బోర్డును బయటకు తీసి రసాయనాల సాయంతో ఆ తడి పూర్తిగా పోయేలా చేస్తారు. 


బ్యాటరీలు ఉబ్చితే?
బ్యాటరీలు ఉబ్బడం అంటే.. అవి అవసానదశకు చేరినట్టేనని అర్థం. వాటిని తక్షణం తీసేసి, కొత్త బ్యాటరీలను వేసుకోవడం ఉత్తమం. దీనికి కారణం ఓవర్ చార్జింగ్. "ఎంత ఎక్కువ సేపు చార్జింగ్ పెడితే అంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు'' అనే ఉద్దేశంతో చాలామంది ఫోన్లను ఎప్పుడూ చార్జింగ్‌లోనే ఉంచుతారు. రాత్రి నిద్రపోయేటప్పుడు చార్జింగ్ పెడితే మర్నాడు ఆఫీసుకెళ్లేదాకా ఆ చార్జింగ్ అలానే ఉంటుంది. ఆఫీసులో ఉన్న ఎనిమిది గంటలూ అలా చార్జింగ్‌లోనే పెట్టి ఉంచేవారూ ఉంటారు. 

దీనివల్ల లిథియం అయాన్ బ్యాటరీల్లో ఉండే క్యాథోడ్‌లో అనేక రసాయన మార్పులు జరిగి కోబాల్ట్ ఆక్సైడ్ ఏర్పడి అలా ఉబ్బిపోతాయి. పాత ఫోన్ల సంగతి పక్కన పెడితే... ఇటీవలి కాలంలో వచ్చే ఫోన్లను గంట-గంటన్నర సేపు చార్జింగ్ పెడితే పూర్తిగా చార్జ్ అయి, 'బ్యాటరీ ఫుల్లీ చార్జ్‌డ్' అనే సందేశం వస్తోంది. అది రాగానే చార్జింగ్ చేయడం ఆపేయవచ్చు. ఫోన్లలోనే కాదు.. ఏ ఎలక్ట్రానిక్ ఉపకరణానికి సంబంధించిన బ్యాటరీ అయినా.. చార్జింగ్ అదేపనిగా పెట్టకూడదు.

-- 

No comments:

Post a Comment