Friday, 1 April 2011


దేశ జనాభా 121,01,93,422
పదేళ్లలో 18.1 కోట్ల జనాభా పెరుగుదల
గత 9 దశాబ్దాల్లో ఇదే తక్కువ

2011 జనాభా లెక్కల విడుదల
మొత్తంగా పెరిగిన లింగ నిష్పత్తి
వెయ్యికి 940 మంది మహిళలు
ఆందోళనకరంగా తగ్గిన బాలికల సంఖ్య

వెయ్యి మంది బాలురకు 914 మందే బాలికలు
అత్యధిక జనాభాతో ఉత్తరప్రదేశ్
అతి తక్కువ జనాభాతో లక్ష్యదీప్
74 శాతానికి పెరిగిన అక్షరాస్యత
అక్షరాస్యతలో అగ్రస్థానం కేరళదే
అథమ స్థానంలో బీహార్
ఢిల్లీ ఈశాన్య జిల్లాలో అధిక జనసాంద్రత
అత్యల్పం అరుణాచల్ ప్రదేశ్‌లోని దిబంగ్ జిల్లా
ఇక్కడ చ.కి.మీ.కు నివసిస్తున్నది ఒక్కరే!
1872లో మొట్ట మొదటి సారి భారత జనాభాను లెక్కించారు. 2011లో జరిగిన జనగణన 15వది. ఈ దఫా గణనకు 2200 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. జనాభా లెక్కల సేకరణలో 27 లక్షల మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. ఈ ప్రక్రియకు మొత్తం 8వేల టన్నుల కాగితాన్ని ఉపయోగించారు. మరో 10,500 టన్నుల సామగ్రిని వాడారు. 2010 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ తొల దశ.. 2011 ఫిబ్రవరిలో మలి దశ గణన జరిగింది 

న్యూఢిల్లీ, మార్చి 31 : భారత జనాభా ఇప్పుడు 121 కోట్లు! ఇంకా కచ్చితంగా చెప్పాలంటే.. 121,01,93,422! ఇది అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్‌లలో ఉన్న మొత్తం జనాభాను కలుపుకొంటే వచ్చేంత! అంటే మొత్తం ప్రపంచ జనాభాలో మన జనాభా 17.5 శాతం. ప్రపంచ జనాభాలో 19.4 శాతాన్ని కలిగి చైనా అగ్ర స్థానంలో ఉండగా.. తదుపరి స్థానం భారత్‌కు దక్కింది. 

ఇందులో 62.27 కోట్ల మంది పురుషులు.. 58.65 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. గురువారం విడుదలైన 2011 జనగణన గణాంకాలు తేల్చి లెక్కలివి! గత పదేళ్ల కాలంలో 18.1 కోట్ల జనాభా పెరిగింది. గత 9 దశాబ్దాల కాలంలో కంటే ఈసారి జనాభా పెరుగుదల రేటు స్వల్పంగా ఉండటం ఇక్కడ విశేషం. 

ఈ దశాబ్దంలో పెరిగిన జనాభా.. బ్రెజిల్ జనాభాకు దాదాపు సమానం. 2001లో జనాభా పెరుగుదల రేటు 21.15 శాతం కాగా.. ఈ సారి అది 17.64 శాతమే. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, భారత జనాభా లెక్కల కమిషనర్ సీ చంద్రమౌళి విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. 

యూపీలో అధిక జనాభా
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధిక జనాభా కలిగినదిగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఈ రాష్ట్రంలో 19.9 కోట్ల మంది ఉన్నారు. అత్యంత తక్కువ జనాభా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా లక్షద్వీప్ ఉంది. ఇక్కడ జనాభా కేవలం 64,429. యూపీ, మహారాష్ట్రల జనాభాను కలుపుకొంటే అమెరికా జనాభా కంటే ఎక్కువ. 

యూపీ తర్వాత మహారాష్ట్ర (11.23కోట్లు), బీహార్ (10.30కోట్లు), పశ్చిమ బెంగాల్ (9.13 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (8.46 కోట్లు) నిలిచాయి. ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో అత్యధిక జనసాంద్రత ఉంది. ఇక్కడ చదరపు కిలోమీటరుకు 37,346 మంది ఉంటే, అరుణాచల్ ప్రదేశ్ దిబంగ్ లోయలో చ. కిలోమీటరుకు ఒకరే ఉన్నారు. 

బాలికల సంఖ్య తగ్గింది
చిన్నారుల విషయంలో బాలికల జనాభా కన్నా.. బాలుర జనాభాయే అధికంగా పెరుగుతూ వస్తోంది. బాలల లింగ నిష్పత్తిలో వెయ్యి మంది బాలురకు గాను 914 మంది బాలికలే ఉన్నారు. స్వాతంత్య్రానంతరం ఇదే అత్యల్పం కావడం గమనార్హం. గత దశాబ్దంలో ఇది 1000-927గా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే హర్యానా, పంజాబ్‌లలో లింగ నిష్పత్తి తక్కువగా ఉంది. 

ఇక్కడ ప్రతి వెయ్యి మంది బాలురకు గాను.. వరుసగా 830, 846 మంది బాలికలే ఉన్నారు. అత్యధిక నిష్పత్తి మిజోరం, మేఘాలయాల్లో ఉంది. అక్కడ వరుసగా వెయ్యి మంది బాలురకు గాను.. 971, 970 మంది బాలికలు ఉన్నారు. దేశం మొత్తం మీద అప్పుడే పుట్టిన బిడ్డలు మొదలుకుని.. ఆరేళ్లలోపు చిన్నారులు 15.88 కోట్లు. ఇది గడిచిన దశాబ్దం కంటే 50 లక్షలు తక్కువ. మొత్తంగా జనాభా లింగ నిష్పత్తిలో వెయ్యి మంది పురుషులకు గాను.. 940 మంది మహిళలు ఉన్నారు. 1971 జనాభా లెక్కల తర్వాత ఇదే అత్యధిక నిష్పత్తి. 

అక్షరాస్యత పెరిగింది
మొత్తం జనాభాలో ఏడు సంవత్సరాలు ఆ పై వయస్కుల్లో 74 శాతం మంది అక్షరాస్యులని లెక్కలు పేర్కొంటున్నాయి. 2001 జనాభా లెక్కలతో పోల్చితే అక్షరాస్యత 64.83 నుంచి 74.04 శాతానికి చేరుకోవడం ఓ శుభ పరిణామం. అంటే 9.21 శాతం పెరుగుదల నమోదైంది. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. కేరళ, లక్షద్వీప్, మిజోరం, త్రిపుర, గోవా, డామన్-డియు, పుదుచ్చేరి, చండీగఢ్, ఢిల్లీ, అండమాన్-నికోబార్ దీవులు అక్షరాస్యత విషయంలో 85 శాతం పైబడి సాధించాయి. 

కేరళ అత్యధికంగా 93.91 శాతం అక్షరాస్యులను కలిగి ఉంది. ఆ తర్వాతి స్థానంలో లక్షద్వీప్ (92.28%) ఉంది. తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రాల్లో బీహార్ అట్టడుగున (63.82%) నిలిచింది. జనాభా గణన అనంతర వర్గీకరణలు త్వరలోనే మొదలవుతాయని, వచ్చే ఏడాదికి తుది జనాభా లెక్కలు అందుబాటులోకి వస్తాయని చంద్రమౌళి తెలిపారు. ఇప్పుడు ఏమైనా పొరపాట్లు ఉంటే తుది జాబితాల్లో సవరిస్తామని వివరించారు. 2001 జనాభా లెక్కల నివేదికలో 2 శాతం తేడా వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
===============
»мαнι ℓσνє'ѕ υ« ●๋•Connecting People

No comments:

Post a Comment