Friday, 8 April 2011

దీక్షా దక్షుడు.. అన్నా!
ఆత్మహత్య యోచన నుంచి.. ఆమరణ దీక్ష వరకు
స్ఫూర్తిదాయకం.. ఆజన్మ బ్మహ్మచారి జీవితం

లెక్కలేనన్ని దీక్షలు.. ప్రతిసారీ విజయమే
రాల్‌గావ్ సిద్ధిని సంస్కరించిన యోధుడు
రెండో స్వాతంత్య్ర పోరాటం కోసం పిలుపు
కదలివస్తున్న యావత్ భారత్‌దేశం
హైదరాబాద్, ఏప్రిల్ 7 : సొంత కుటుంబం లేదు.. నయాపైసా ఆస్తి లేదు.. బ్యాంకు బ్యాలెన్స్ అంతకంటే లేదు. మహారాష్ట్రలో తాను కలలు గని పునర్నిర్మించిన రాలెగావ్ సిద్ది గ్రామంలోని యాదవబాబా ఆలయానికి అనుబంధంగా ఉన్న చిన్న గదిలోనే నివాసం. ఖాదీ వస్త్రధారణ. కానీ.. ఆయన నోరు తెరిస్తే చాలు.. ప్రజాస్వామ్య విప్లవాగ్నులు రగులుతాయి. కాలు కదిపితే చాలు.. గ్రామాలు అభివృద్ధి పథం పడతాయి. తనను తాను ఫకీరుగా పిలుచుకునే ఆయన అసలుపేరు.. కిసాన్ బాబూరావ్ హజారే. అందరికీ తెలిసిన పేరు.. అన్నా హజారే. 

అవినీతిని అంతం చేయాలనే మహోన్నత లక్ష్యంతో దేశ రాజధానిలో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష.. కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఊరూ ఆయన బాటలోనే నడుస్తోంది. ఇప్పుడే కాదు.. ఆయన ఎప్పుడు దీక్ష ప్రారంభించినా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న నాయకులు ఆయన దగ్గరకు వచ్చి.. సమస్యను పరిష్కరిస్తారు.

రాలెగావ్ సిద్ధి గ్రామంలో పశువులను ఆరుబయట వదిలేసే అలవాటు మాన్పించడానికి కూడా ఆయన 'నిరాహార దీక్ష'నే అస్త్రంగా ఉపయోగించారు. సామాన్యులు అందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించగల సామర్థ్యం ఆయనకే సొంతమన్న విషయాన్ని ఆయన వ్యతిరేకులూ అంగీకరిస్తారు. 1940 జనవరి 15న జన్మించిన ఆయన బాల్యం అంతా అస్తవ్యస్తంగానే గడిచింది. ఏడోతరగతి తర్వాత చదువు ఆపేయాల్సి వచ్చింది. 

1960లో సైన్యంలోకి ఎంపికయ్యారు. తొలినాళ్లలో పంజాబ్‌లో ట్రక్కు డ్రైవర్‌గా పనిచేశారు. కుటుంబానికి, స్నేహితులకు.. అందరికీ దూరం కావాల్సి రావడంతో తీవ్ర నిరాశా నిస్పృహలతో ఆత్మహత్య చేసుకుందామని, లేఖ కూడా రాశారు. కానీ, చెల్లెలి పెళ్లి అయ్యేవరకు వాయిదా వేసుకున్నారు. ఈలోపు జరిగిన రెండు సంఘటనలు ఆయన జీవిత గమనాన్నే మార్చేశాయి. 1965 ఇండోపాక్ యుద్ధంలో ఆయన నడుపుతున్న ట్రక్కు మీదుగా పైన పాక్ విమానం ఎగురుతోంది. 

అది గమనించి సహచరులతో పాటు ఆయనా కిందకు దూకేశారు. విమానం నుంచి పడిన బాంబు పేలి ఆయన సహచరులందరూ మరణించినా.. హజారే బతికి బయటపడ్డారు. మరోసారి నాగాలాండ్‌లో పనిచేసేటప్పుడు అజ్ఞాత నాగాలు సైనిక గస్తీ కేంద్రంపై అర్ధరాత్రి దాడి చేసి.. అందరినీ హతమార్చారు. ఆ సమయంలో మూత్ర విసర్జనకు బయటకు వెళ్లిన హజారే మాత్రం బతికారు. 

ఈ రెండు సంఘటనలతో పాటు.. ఆయన ఎప్పటినుంచో చదివిన స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ, ఆచార్య వినోబా భావేల పుస్తకాలు హజారే జీవిత గమనాన్ని మార్చేశాయి. సైన్యంలో ఉద్యోగవిరమణ చేసి.. 1975లో ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. తన కోసం ఏడ్చే కుటుంబం లేనప్పుడు.. దేశం కోసం మరణిస్తే సంతోషిస్తానని ఆజన్మ బ్రహ్మచారి అయిన హజారే అంటారు. 

అవినీతి, లంచగొండితనం, రెడ్ టేపిజం, నిజాయితీపరులైన అధికారులకు తరచు బదిలీలు.. ఇలాంటి వాటన్నింటి నుంచి విముక్తి పొందాలంటే మరో స్వాతంత్య్ర పోరాటం తప్పదని పిలుపునిచ్చారు. తీవ్రమైన కరువు, దారిద్య్రం, నేరాలు, తాగుడు వంటి వాటిలో కూరుకుపోయిన రాలెగావ్ సిద్ధిని ఆయన సంస్కరించారు. అక్కడ కూడా ప్రభుత్వ పాఠశాల కోసం ఆయన ప్రయోగించిన తొలి అస్త్రం.. నిరాహార దీక్షే. రాలెగావ్ సిద్ధిని తీర్చిదిద్దడంలో ఆయన చూపిన నిబద్ధతకు 1992లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. రామన్ మెగసెసె అవార్డు కూడా వరించింది.

అవినీతి మంత్రులకు ఉరి వేయాలి
అధికారం, ధనబలాలు జనాన్ని మత్తులో ముంచేస్తున్నాయి. రాజకీయ నాయకులు లోక్‌పాల్ బిల్లును కోరుకోవడం లేదు. ఎందుకంటే ఆ బిల్లు వారి దోపిడీని అడ్డుకుంటుంది. 2జీ కుంభకోణం, కామన్‌వెల్త్ అక్రమాలు, ఆదర్శ్ హౌసింగ్ స్కామ్‌లు వెలుగులోకి వచ్చినా.. వాటికి కారకులైన వారికి మాత్రం జైలు శిక్షలు పడటం లేదు. అందుకే లోక్‌పాల్ బిల్లు కావాలి. 

అప్పుడే అవినీతి రాజకీయ నాయకులను జైలు కు పంపి, ఉరి తీయవచ్చు. గాంధేయ వాదినైన నేను ఉరి శిక్షల గురించి మాట్లాడటమేంటని అడగొచ్చు. కానీ.. పరిస్థితి ఎంత తీవ్ర దశకు చేరుకుందంటే.. మనం కేవలం గాంధీని అనుసరిస్తే సరిపోదు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌నూ అనుసరించాలి.
- దీక్షాశిబిరం వద్ద ప్రజలనుద్దేశిస్తూ అన్నా హజారే.


--

»мαнι ℓσνє'ѕ υ« ミℓινє ιт & ℓσνє ιт彡


No comments:

Post a Comment