Saturday, 9 April 2011

జన లోక్‌పాల్ వస్తే పెద్ద తలలూ ఔట్?

కేంద్ర డజను మండలి
కేబినెట్‌లో ద్వాదశావతారాలు
కళంకిత ముద్రలు, అవినీతి ఆరోపణలు
జన లోక్‌పాల్ వస్తే పెద్ద తలలూ ఔట్?

అవినీతి, అధికారం! ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం. అందుకే... అవినీతిని నిర్మూలిద్దామంటే అధికారం ససేమిరా అంటుంది. 'నీవు లేక నేను లేను' అంటూ రాగం అందుకుంటుంది. అందుకే... 'అధికారం' జన లోక్‌పాల్ బిల్లుకు ససేమిరా అంటోంది. ఈ బిల్లు ఇప్పటికిప్పుడు చట్టంగా మారితే... కేంద్ర కేబినెట్‌లోని పలు పెద్ద తలకాయలే లేచిపోతాయి మరి! ఒకరా... ఇద్దరా! మన్మోహన్ మంత్రివర్గంలో 12 మంది అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొందరు ప్రత్యక్ష కళంకితులైతే... 

మరికొందరు కళంకితులకు అండగా ఉంటున్న వారు. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలున్నా... వారిని ఏమీ చేయలేని పరిస్థితి. మొన్న జనవరిలో మంత్రివర్గంలో భారీ స్థాయిలో మార్పులు చేయాలని మన్మోహన్ అనుకున్నా... ఏ అవినీతి మంత్రిని తప్పించాలనే విషయంపై ఆయన, సోనియా తేల్చుకోలేకపోయారు. ఎవర్నీ మార్చకుండా కేవలం శాఖలు మార్చి, నలుగురైదుగురిని చేర్చి ఊరుకున్నారు. ఇప్పుడున్న కేబినెట్‌లో... 'బెంగాలీ బాబు' ప్రణబ్ దాదా నుంచి కర్ణాటక నేత వీరప్ప మొయిలీ దాకా 12 మందిపై పలురకాల ఆరోపణలున్నాయి.

కామన్వెల్త్ నుంచి 2జీ దాకా... హసన్ అలీ నుంచి రాజా దాకా! రూ.వేల కోట్ల కుంభకోణాలు! స్కాముల ఊబిలో కూరుకుపోయిన మన్మోహన్ సర్కారు.. అన్నా హజారే దీక్షతో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి... మన్మోహన్ కేబినెట్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై పడింది. కేబినెట్‌లో కనీసం డజను మంది స్వయంగా అవినీతిపరులు కావడం లేదా అవినీతిపరులకు అండగా నిలిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

బడా సంస్థల పెన్నిధి... ప్రణబ్ దా:
పెద్ద మనిషిలా, దేశంలో అన్ని వివాదాలను తానే పరిష్కరించే మేధావిలా వ్యవహరించే ప్రణబ్ నల్లధనం నుంచి.. ఆదాయపన్ను ఎగవేతదారుల వరకు ఎవరి గురించి ప్రశ్నించినా డొంకతిరుగుడు, దబాయింపు సమాధానాలతో తప్పించుకోగల దిట్ట. 1973 నుంచి కేంద్రమంత్రిగా ఉన్న ప్రణబ్ 1982లో ఆర్థిక మంత్రిగా ప్రపంచబ్యాంకు కితాబులందుకున్నారు. ఎమర్జెన్సీలో అత్యాచారాలకుగాను ఇందిరాగాంధీతో పాటు షా కమిషన్ ముందు హాజరైన ప్రణబ్.. దేశంలో బడా వ్యాపార సంస్థ రిలయన్స్‌కు అత్యంత సన్నిహితుడని అంటారు. ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్‌లో ఏదో రూపేణా రిలయన్స్ లాంటి బడా సంస్థలకు వేల కోట్ల పన్ను రాయితీ కల్పించే ప్రణబ్‌పై నిర్దిష్ట అవినీతి ఆరోపణలు లేకపోయినా, స్వచ్ఛమైన వ్యక్తి అని చెప్పడం కష్టం.

మాయల మరాఠా... పవార్:
వేల కోట్లకు అధిపతైన శరద్ పవార్ కేంద్రంలో బలమైన మంత్రి. 20 ఏళ్ల క్రితం ముంబై మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ జీఆర్ ఖైర్నార్.. నాటి సీఎం పవార్‌పై అవినీతి ఆరోపణలు చేశారు. పవార్ హయాంలో అవినీతి అధికారులను తొలగించాలని ఇదే హజారే ఒకప్పుడు నిరాహార దీక్ష చేశారు. పప్పూ కలానీ, హితే ంద్ర ఠాకూర్ లాంటి మాఫియా డాన్‌లను ఎన్నికల్లో నలిపిన ఘనత పవార్‌కే దక్కుతుంది. తెల్గీ స్టాంపుల స్కాం సహా అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, 2జీ స్కాం నిందితుడు షాహిద్ బల్వాతో పవార్‌కు సంబంధముందని వార్తలొచ్చాయి. వ్యవసాయ మంత్రిగా వేల కోట్ల గోధుమల దిగుమతులు, పంచదార, ఉల్లిగడ్డల ధరల పెరుగుదల, తాజాగా క్రిమిసంహారక మందుల స్కాంలోనూ పవార్ హస్తం ఉన్నట్లు తేలింది.

కార్పొరేట్ ఏజెంట్... చిదంబరం:
సెక్యూరిటీల కుంభకోణంలో చిక్కుకున్న ఫైర్‌గ్రోత్ కంపెనీలో వాటాలున్నందుకు 1992లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన చిదంబరం బడా కార్పొరేట్ కంపెనీల ఏజెంట్‌గా ముద్రపడ్డారు. దేశానికి తీవ్ర నష్టం మిగిల్చిన ఎన్రాన్ విద్యుత్ సంస్థకు న్యాయవాదిగా వ్యవహరించారు. స్వచ్ఛందంగా ఆదాయాన్ని వెల్లడిస్తే ఆయా చట్టాల కింద శిక్ష పడదని 1997లో ఒక వివాదాస్పద పథకాన్ని ప్రవేశపెట్టగానే తన అక్రమ ఆదాయాన్ని వెల్లడించారు. ఆయన భార్య నళినీ చిదంబరంపైనా ఆరోపణలున్నాయి. ఆర్థిక మంత్రి అయ్యేవరకు బ్రిటిష్ మైనింగ్ కంపెనీకి వేదాంతకు డైరెక్టర్‌గా ఉన్న చిదంబరం.. దానికి న్యాయవాదిగా కూడా వ్యవహరించారు. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిపై ఒత్తిడి తెచ్చి తన ఓటమిని 3,500 ఓట్ల గెలుపుగా మార్చుకున్న ఘనత ఈయనదే!

డీనోటిపికేషన్ వీర... కృష్ణ:
ఎస్ఎం కృష్ణ కర్ణాటక సీఎంగా ఉ న్నప్పుడు పలు అవినీ తి ఆరోపణ లు ఎదుర్కొన్నారు. వాటిలో ముఖ్యమైనవి.. బడా కంపెనీలకు పెద్ద ఎత్తున భూములు కేటాయించేందుకు వాటిని డీ నోటిఫై చేయడం. కేంద్రం నుంచి పనికి ఆహార పథకం కింద వచ్చిన 17 వేల టన్నుల బియ్యాన్ని అక్రమంగా మళ్లించిన కుంభకోణంలో కృష్ణకు పాత్ర ఉన్నదని చెబుతారు. దీనిపై విచారణ చేయాలని కోర్టు ఆదేశించినా తమకు పనిభారం ఉందని సీబీఐ తప్పించుకుంది.

అబద్ధాల... షిండే:
అబద్ధాల కోరుగా.. మంత్రి పదవికి ఉన్న ప్రతిష్ఠను దిగజార్చిన వ్యక్తిగా అన్నా హజారే విమర్శించిన వ్యక్తి.. కేంద్ర విద్యుత్ మంత్రి సుశీల్‌కుమార్ షిండే. ఆదర్శ్ సొసైటీకి రాయితీలు కల్పించిన సీఎంలలో ఈయనా ఒకరు. దీనిపై రాష్ట్ర ఏసీబీలో ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఈ సొసైటీలో 51 పేర్లు చేర్చిన ఘనత షిండేకు దక్కుతుంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మరీ షిండే ఈ ఫైలును ఆగమేఘాలపై ఆమోదింపచేశారు. ఈ సొసైటీకి మార్కెట్ విలువలో 20%కి భూమి కేటాయించిన ఘనతా ఆయనదే. ఎస్ఐ నుంచి రాష్ట్ర మం త్రిగా, సీఎంగా, గవర్నర్‌గా, కేంద్ర మంత్రి గా బాధ్యతలు నిర్వహించిన షిండే తొలుత శరద్‌పవార్ మనిషిగా ఉన్నా.. తర్వాత సోనియా విధేయుడయ్యా రు. బడాసంస్థలకు గుట్టుచప్పుడు కాకుకండా మేలుచేయడంలో ఆయనకు ఆయనే సాటి.

కుంభకోణాల వీరుడు.. విలాస్‌రావు:
ముంబై మీద ఉగ్రవాదుల దాడి తర్వాత.. సీఎం పదవికి రాజీనామా చేసి కేంద్రంలో మంత్రిగా చేరిన విలాస్‌రావు దేశ్ ముఖ్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. ఒక కంపెనీకి అనుకూలంగా టెండర్ నిబంధనలను మార్చేందుకు విలాస్‌రావు ఆదేశాలిచ్చారని, ఈ కంపెనీలో ఆయనకు, ఆయన కుమారుడికే కాక సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌కూ వాటాలున్నాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ఆరోపించారు. తన ఆరోపణలు తప్పయితే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెప్పిన గడ్కరీ.. పలు కీలక డాక్యుమెంట్లను శాసనమండలి చైర్మన్ శివాజీరావు దేశ్‌ముఖ్‌కు సమర్పించారు. పేద రైతులతో వడ్డీ వ్యాపారం చేసి అక్రమంగా ధనార్జన చేసిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాపాడేందుకు విలాస్ జోక్యం చేసుకున్నారని సుప్రీంకోర్టే తీవ్రంగా విమర్శించింది. ముంబై హైకోర్టు విధించిన రూ.25వేల జరిమానాను రూ.10 లక్షలకు పెంచింది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలోనూ దేశ్‌ముఖ్ హస్తం ఉంది.

బెయిల్‌పై కేంద్ర మంత్రి... వీరభద్ర:
హిమాచల్‌ప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో.. తన అవినీతి వ్యవహారాలు, కుంభకోణాల గురించి ఒక మాజీ అధికారితో మాట్లాడుతూ వీరభద్ర సింగ్ దొరికిపోయారు. వీరభద్ర సింగ్, ఆయన సతీమణి ప్రతిభ అవినీతి కార్యకలాపాలను వారి మాటలతోనే రికార్డు చేసిన ఒక సీడీ బయటకు విడుదల కావడంతో కోర్టు ఆదేశాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్ విజిలెన్స్ బ్యూరో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. వివిధ పారిశ్రామికవేత్తలు, బ్యూరోకాట్ల నుంచి వీరభద్ర సింగ్, ఆయన సతీమణి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన వైనం బయటకు పొక్కింది. ప్రస్తుతం బెయిల్‌పైనే కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న వీరభద్ర సింగ్ సాక్షులపై ఒత్తిడి తెస్తున్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలని హిమాచల్ ప్రభుత్వం గురువారమే పిటిషన్ దాఖలు చేసింది.

రాష్ట్రా నుండి ముడుపులు.. మొయిలీ:
1984లో రామకృష్ణ హెగ్డే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బైరెగౌడ అనే స్వతంత్ర ఎమ్మెల్యేకు రూ. 2 లక్షల లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణను న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఎదుర్కొన్నారు. ఈ కుంభకోణం.. మొయిలీ టేప్స్ పేరిట ప్రసిద్ధి చెందింది. తర్వాత సీఎంగా కూడా మొయిలీ పలు ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఎల్ఐసీ ఉద్యోగి నుంచి దేవరాజ్ అర్స్ శిష్యుడిగా మారి అంచెలంచెలుగా ఎదిగిన మొయిలీపై ఆరోపణలకు కొదవ లేదు. తెల్గీ స్టాంపుల కుంభకోణం, కలప కుంభకోణం, కొజింట్రిక్స్ కుంభకోణం లాంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. పార్టీ తరఫున అసోం, ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరించిన మొయిలీ ఈ రాష్ట్రాల నేతల నుంచి భారీ ముడుపులు స్వీకరించారని, చివరివరకు జగన్‌ను కాపాడే ప్రయత్నం చేశారని అంటారు. మొయిలీ అకృత్యాలపై రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ నేత సోనియాకు రహస్య నివేదికను సమర్పించారు.

గుట్టు చప్పుడు కానివ్వని రవి:
కాంగ్రెస్ రాజకీయాల్లో పాత కాపు అయిన వాయలార్ రవి.. అవినీతి కార్యకలాపాలను కూడా గుట్టు చప్పుడు కాకుండా చేయడంలో దిట్ట అంటారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా పనిచేసిన రవి.. ఆయా రాష్ట్రాల నేతలకు యథాశక్తి తోడ్పాటు అందించి వారి 'మన్నన'లు అందుకున్న వ్యక్తి. ఈయన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్నప్పుడే పీజేఆర్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్సార్ సస్పెండ్ చేయించగలిగారు. వైఎస్‌కు పాదయాత్ర సలహా ఇచ్చింది కూడా రవే. కేరళలో మద్య లైసెన్సులు ఇప్పించి ముడుపులు పొందారని ఆరోపణలున్నాయి.

15%తో రోడ్డు ప్రాజెక్టులు... కమల్‌నాథ్:
1984లో సిక్కుల ఊచకోతలో ఆరోపణలు ఎదుర్కొన్న కమల్‌నాథ్.. రాజీవ్, సోనియాలకు విధేయుడు. 15% వాటా ఇస్తే చాలు..భారీ రహదారి ప్రాజెక్టులను ఆయన మంజూరు చేయగలరని సీఐఐకి చెందిన ఒక పారిశ్రామిక వేత్త కార్పొరేట్ లాబీయిస్టు నీరారాడియాతో అన్న విషయం టేపుల్లో వెల్లడైంది. స్వయంగా వ్యాపార వేత్త కమల్‌నాథ్ కులుమనాలీ వద్ద బియాస్ నది ఒడ్డున ఒక హోటల్ నిర్మించి పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు సుప్రీంకోర్టు రూ.10 లక్షల జరిమానా విధించింది. వికీలీక్స్ కథనం ప్రకారం కమల్‌నాథ్ ఎంపీలకు ముడుపులు చెల్లించారని తేలింది. వాణిజ్యమంత్రిగా 500 ఎస్ఇజడ్‌లు కేటాయించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి.

ఇంట్లోనే ఎక్స్ఛేంజి... మారన్:
మన్మోహన్ కేబినెట్‌లో టెలికమ్యూనికేషన్ల మంత్రిగా దయానిధి మారన్ పలు అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. టాటా డీటీహెచ్ ప్రాజెక్టు నుంచి తన సన్‌టీవీ నెట్‌వర్క్‌కు 33% వాటా కోరారని ఆరోపణలున్నాయి. సన్ టీవీ కోసం పెద్ద ఎత్తున డేటాను ప్రసారం చేసే 323 టెలిఫోన్ లైన్లను బీస్ఎన్ఎల్ ద్వారా పొందారని, తన ఇంట్లోనే టెలిఫోన్ ఎక్స్‌ఛేంజిని ఏర్పాటు చేయించుకోగలిగారని ఆరోపణలొచ్చాయి.ప్రైవేట్ మొబైల్ కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చేందుకు అనేక చర్యలు తీసుకున్న మారన్ ఐటీ మంత్రిగా పలు కంపెనీలకు పన్ను రాయితీలు కల్పించారు. మారన్ వల్ల బీఎస్ఎన్ఎల్‌కు 10వేల కోట్ల నష్టం వచ్చిందని ఆయన తర్వాత మంత్రి అయిన రాజాయే ఆరోపించారు.

ప్రైవేటు విమాన మిత్రుడు.. ప్రపుల్ పటేల్:
ఎన్‌సీపీకి చెందిన ప్రఫుల్‌పటేల్ నిన్నమొన్నటివరకు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎయిరిండియాకు వేలకోట్ల నష్టం కలిగించారు. కింగ్ ఫిషర్, జెట్‌ల కోసం ఎయిరిండియాకు చెందిన పలు మార్గాలను రద్దుచేశారు. విమానాల రాకపోక ల సమయాన్ని మార్చారు. ఐపీఎల్ జట్లు ప్రయాణించేందుకు వీలుగా ప్రైవేట్ విమానాల కోసం చర్యలు తీసుకోవడంతో ఎయిరిండియా విమానాల ప్రయాణికులు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. అసలు ప్రఫుల్ పటేల్.. కింగ్ ఫిషర్ కోసమే పనిచేశారని నీరారాడియా వ్యాఖ్యానించడం గమనార్హం.

-- 

»мαнι ℓσνє'ѕ υ« ミℓινє ιт & ℓσνє ιт彡

No comments:

Post a Comment