Monday, 2 May 2011

దేవాంతకులు 2: సత్యం వధ!

దేవాంతకులు 2: సత్యం వధ!
ప్రశాంతి నిలయం హత్యలు ఇందుకేనా?
సత్యసాయి ట్రస్టులో మాఫియా

విరాళాలు సేకరిస్తున్న ఘనులు
వారిని పట్టించేందుకు వెళ్లాం
పోలీసులకు నాడు ప్రభు, రవి వాంగూల్మం
వారిద్దరి ఆచూకీ ఓ పెద్ద మాస్టరీ
జగన్ సమాధి కూడా తల్లికి చూపని పోలీసులు
18 ఏళ్లుగా చార్జిషీటు లేని కేసు
శవాలు మాట్లాడ లేవు. బతికున్న మనుషులే మాట్లాడగలరు. 1993 జూన్‌లో ప్రశాంతి నిలయంలో ఆరుగురు శవాలయ్యారు. ఏం జరిగిందో నోరు తెరిచి మాట్లాడలేని స్థితిలోనే వారంతా కన్నుమూశారు. కానీ, ఇద్దరు మాత్రం బతికి బయటపడ్డారు. నోరు తెరిచి మాట్లాడారు.

ట్రస్టు బండారం బయటపెట్టారు. బాబాకు విరాళాలుగా వచ్చిన సొమ్మును ట్రస్టు సభ్యులు కొందరు పంచుకు తినేవారని, ఆ దొంగల్ని రెడ్ హ్యాండెడ్‌గా బాబాకు పట్టించడం కోసమే తాము ఆ రోజు ప్రశాంతి నిలయంలోకి వెళ్లామని వారు అప్పట్లో వెల్లడించారు. తాము బాబాను చంపడానికి వెళ్లినట్టు ట్రస్టు సభ్యులు కథలు అల్లారని వాపోయారు. దొంగలు దొరలయ్యారు! అమాయకులు మాత్రం దొంగలుగా, బాబాపై హత్యాయత్నం చేసిన వారుగా మిగిలిపోయారు. ఇది 18 ఏళ్లుగా వీడని పుట్టపర్తి మిస్టరీ!

దొంగలు దొరలయ్యారు! అమాయకులు మాత్రం దొంగలుగా, బాబాపై హత్యాయత్నం చేసిన వారిగా మిగిలిపోయారు. ఇది 18 ఏళ్లుగా వీడని పుట్టపర్తి మిస్టరీ! ఒక రాత్రి... ఆరు 'హత్యలు'! జరిగింది పుట్టపర్తిలో... సత్యసాయిబాబా నివాస మందిరంలో! బాబా సొమ్మును మొక్కుతున్న వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించడానికి వెళ్లిన వాళ్లపై 'దొంగలు' అనే ముద్ర వేశారు. బాబాను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. నలుగురిని కాల్చి చంపేశారు.

ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు 'నిందితులు' అసలు గుట్టు విప్పారు. అయితే, నిందితుల మాటకు ఎంత విలువుంటుంది? బాబాను చంపడానికి వచ్చినవారు ట్రస్టు సభ్యులపై అభాండాలు వేస్తే వాటిని ఎలా నమ్మగలం? అనే ప్రశ్నలు రావడం సహజం. కానీ, ప్రశాంతి నిలయంలో ఆ రోజు జరిగిన హత్యలు అతి పెద్ద మిస్టరీ. 18 ఏళ్లు గడుస్తున్నా ఆ మిస్టరీ వీడలేదు. ఆ కేసులో ఎఫ్ఐఆర్ తప్ప చార్జిషీటే దాఖలు కాలేదు. దెబ్బలు తిని గదిలో బందీలుగా పడి ఉన్నవారిని పోలీసులు కాల్చి చంపాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నకు సమాధానం లేదు.

సత్యసాయిపై దాడి చేయడానికే దుండగులు లోపలికి వచ్చారని ట్రస్టు సభ్యుల్లో కొందరు చెప్పగా, అది బాబాపై దాడి కాదని, ప్రశాంతి నిలయంలోని అంతర్గత కుమ్ములాటల వల్లే ఆ సంఘటన జరిగిందని ట్రస్టు సీనియర్ సభ్యుడు ఇందులాల్ షా బాహాటంగా ప్రకటించారు. ఆ రోజు రాత్రి అక్కడ కనిపించిన భారీ మొత్తం నగదు ఆ తర్వాత మాయమైందని స్వయంగా ఒక పోలీసు అధికారి (సీఐ) వెల్లడించారు. ఇంతటి వైరుధ్యం, మాయామర్మం దాగి ఉన్న కేసులో నిందితులు చెప్పేదానికి కచ్చితంగా విలువ ఉంటుంది.

పైగా... అన్నింటికంటే వింత ఏమిటంటే గత 18 ఏళ్లుగా ఈ నిందితులు 'కనిపించుట లేదు'. బెయిల్‌పై బయటికి వెళ్లిన తర్వాత వారు ఎక్కడ ఉన్నారో, ఏమయ్యారో ఎవరికీ తెలియదు. 18 ఏళ్లయినా వారిపై చార్జిషీటు కూడా దాఖలు కాలేదు కాబట్టి వారిని ఇప్పుడు నిందితులని కూడా అనలేం. అందుకే వారు ఆనాడు చెప్పిన మాటలు చాలా విలువైన మాటలే! ఈ కేసులో కింది స్థాయి సీఐ నుంచి కేంద్ర మంత్రుల వరకూ అందరినీ సాయి ట్రస్టు సభ్యులు మేనేజ్ చేయగలిగారని, సత్యాన్ని వధించారని సామాన్యులు కూడా సులభంగానే అర్థం చేసుకోవచ్చు.

1993 జూన్ 8న ఆరుగురు యువకులు ప్రశాంతి నిలయంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆరుగురు యువకులు ఆ రోజు రాత్రి బాబా వ్యక్తిగత మందిరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా వారిని అడ్డుకునే క్రమంలో రాధాకృష్ణ, సాయికుమార్ మహాజన్ అనే బాబా సహాయకులు మరణించారు.

దాడి చేసిన వారిలో ఇద్దరు పారిపోగా జగన్, సురేష్ కుమార్, సాయిరాం, ప్రభు అనేవారిని పోలీసులు కాల్చిచంపారు... ఇది పోలీసులు చెప్పిన కథ. పారిపోయిన ఆ ఇద్దరు నిందితులు శాంతారాం ప్రభు, బోయపాటి రవిలు నాగపూర్‌లో అరెస్టయ్యారు. అక్కడి పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. అందులో సంచలనాత్మక అంశాలు బయటపెట్టారు. వీరిలో ప్రభు స్టేట్‌మెంట్ సారాంశం ఇదీ...

"విదేశాల్లో ఉన్న సత్యసాయిబాబా భక్తులు అనేకమంది ఆదాయపు పన్ను గొడవల నుంచి తప్పించుకోవటానికి, బ్లాక్ మనీని సర్దుబాటు చేసుకోవటానికి కరెన్సీని, ట్రావెలర్స్ చెక్కులను బాబా పేరుతో పంపుతూ ఉంటారు. బాబాకు వచ్చిన తపాలా మొత్తాన్ని రాధాకృష్ణ (బాబా వ్యక్తిగత సహాయకుడు), కొందరు ట్రస్టు సభ్యులు తెరిచి చూస్తుంటారు. ఈ కరెన్సీని లె క్కల్లో చూపకుండా రాధాకృష్ణ, మరికొందరు కాజేస్తున్నారు.

ఈ విషయం చాలా కాలం క్రితం మేం గుర్తించి బాబాకు తెలియజేసి నా... ఆయన మౌనం దాల్చారు. విదేశీ కరెన్సీని పుట్టపర్తిలో ఉ న్న కొన్ని కాశ్మీరీ దుకాణాల వారికి ఇచ్చి వారి నుంచి ఇండియన్ కరెన్సీ తీసుకోవటం కొన్నేళ్లుగా జరుగుతూనే ఉండేది. ఈ విషయం ఒకేషనల్ సెంటర్ మేనేజర్, ప్రశాంతి నిలయం సెక్యూరిటీ ఇన్‌ఛార్జి విజయ శాంతారాంలకు తెలుసు.

సాయిబాబా కొ ద్ది కాలం బెంగళూరులో ఉండి ప్రశాంతి నిలయానికి తిరిగి వ చ్చారు. అప్పటికే మూడు నెలలుగా పడి ఉన్న తపాలాను తెరవాలని రాధాకృష్ణ, తదితరులు నిర్ణయం తీసుకున్నారు. ఏవైనా అ త్యవసర వివరాలు తెలియజేయవచ్చుననే ఉద్దేశంతో బాబా శయన మందిరం వద్దనే తపాలా తెరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమయంలో నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని మేం(జగన్, సురేష్, సాయిరాం, ప్రభు, శాంతారాం ప్రభు, బో యపాటి రవి) పథకం వేశాం.

మేం (శాంతారాం ప్రభు, బోయపాటి రవి) దూరంగా కిళ్లీ వేసుకుంటూ ఉంటామని.. రాధాకృష్ణ, ఇతర ట్రస్టు సభ్యులు వచ్చి నోట్లు జేబులో పెట్టుకుంటున్నప్పుడు మాకు సంకేతాలు పంపాలని మిగతా వారికి చెప్పి దూరంగా వె ళ్లాం. కానీ ఆ నలుగురి నుంచి ఎంత సేపటికీ సంకేతాలు రాలే దు. కొద్ది సేపటికి అల్లారం మోగటం, అలజడి చెలరేగటం గమనించి అక్కడి నుంచి పారిపోయాం..''- నాగపూర్ పోలీసులకు ప్రభు ఇచ్చిన వాంగ్మూలం ఇది. దీనిని చదివితే ఆ రోజు ఏం జరిగిందనేది చాలావరకూ అర్థమవుతుంది.

మర్నాడే మారిన సీన్

అయితే, సాయి ట్రస్టులో ఉన్న సభ్యులు కాలాంతకులు. తి మ్మిని బమ్మి చేయగలిగినవారు. కాల్పుల ఘటన జరిగిన మర్నాటికి మొత్తం సీనంతా మారిపోయింది. కేంద్ర హోంమంత్రి ఎస్.బి.చవాన్ పుట్టపర్తి వచ్చి వాలిపోయారు. డీజీపీ టి.సత్యనారాయణరావు, క్రైమ్ బ్రాంచ్ డీఐజీ రామచంద్రయ్యలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును వెంటనే సీబీసీఐడీకి అప్పచెప్పేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, పోలీసులు ఈ విషయంలో మౌనం పాటించటం మొదలుపెట్టారు.

మొదట్లో - "ఇది సాయిబాబా మీద జరిగిన దాడి అని మేం భావించడం లేదు. అయితే, ఇప్పుడే నేను ఏ విషయం చెప్ప లేను. అన్ని కోణాల నుంచీ దర్యాప్తు చేస్తున్నాం'' అని చెప్పిన డీజీపీ సత్యనారాయణరావు తర్వాత ఇది సత్యసాయిపై జరిగిన దాడేనన్నారు. తర్వాత తాము ప్రశాంతి నిలయంలో తనిఖీలు నిర్వహించామని.. మూడు డిటోనేటర్లు, గద లాంటి ఆయుధం, పొటాషియం సైనేడ్ లభించాయని పోలీసులు ప్రకటించారు.

వారు అలాంటివాళ్లా?

బాబాపై దాడికి ప్రయత్నించారంటున్న నిందితుల చరిత్ర చూస్తే... వారలా చేశారని ఎవరూ నమ్మరు. శాంతారామ్ ప్రభు మెరైన్ ఇంజనీరు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు పుట్టపర్తి వచ్చాడు. తల్లి చనిపోయాక ఉద్యోగానికి వెళ్లిపోదామని ప్రభు అనుకున్నా బాబా వెళ్లనివ్వలేదు. బాబా ఇచ్చిన క్వార్టర్‌లోనే ప్రభు కుటుంబం నివసించేది. ఆ రోజు సాయంత్రం ప్రభు బయటకు వెళ్లాడని, రాత్రి వచ్చేస్తానని చెప్పి రాలేదని అతని భా ర్య వినీత వెల్లడించారు.

ఇక సాయిరాం ఎంకామ్ చదువుతున్నాడని, అతడు బాబా సమక్షంలో ఉపన్యాసాలు ఇచ్చేవాడని అతడి తల్లి సరోజా కృష్ణమూర్తి తెలిపారు. మరో నిందితుడు జగన్ బాబాకు పరమ భక్తుడని అతని తల్లి రత్నమ్మ పేర్కొంది. 10వ తేదీ మధ్యాహ్నం తన కుమారుడి శవాన్ని ఖననం చేసిన పోలీసులు, తనకు ఆ సమాచారం కూడా ఇవ్వలేదని, కనీసం సమాధిని చూపించడానికి కూడా నిరాకరించారని ఆమె ఆక్రోశించింది.

సీబీఐ విచారణకు నో

ఇంతలో ఈ కేసుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా హేతువాద సంఘాలు, ఇతరులు ఆందోళన ప్రారంభించారు. సాయిబాబాను ఎందుకు ప్రశ్నించలేదని పోలీసులను నిలదీశారు. వెంటనే కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దాడి జరిగినఐదు రోజులకు అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి కూడా పుట్టపర్తి వెళ్లారు. సీబీఐకి ఈ కేసు ఇవ్వబోమని స్పష్టం చేశారు. "బాబా మామూలుగానే ఉన్నారు. జనం వచ్చి చూస్తున్నారు. అయితే జరగకూడదని ఏదో జరిగిందనే భావన మాత్రం ఆయనలో ఉంది'' అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

అంత కన్నా ముఖ్యంగా- బాబాతో సమావేశమయిన తర్వాత సాయి సోదరుడు జానకి రామయ్యతోను, అనంతపురం రేంజీ డీఐజీ రామచంద్రరెడ్డితోను కోట్ల ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తం కేసు తీరుతెన్నులే మారిపోయాయి. ప్రశాంతి నిలయంలో సంఘటన జరిగిన పది రోజులకు నిందితులు ప్రభు, రవిలను నాగపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరిద్దరూ తమకు సాయిబాబా అంటే వ్యతిరేకత లేదని.. ఆయన సంపదను దోచేస్తున్న ట్రస్టు మాఫియాను ఎదుర్కొనేందుకే ఈ పని చేశామని వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే ఈ నిందితులూ ఇద్దరు నాగపూర్‌కు ఎందుకు వెళ్లారు? వారికి ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీలకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయంపై కూడా పెద్ద వివాదం చెలరేగింది.

కోల్డ్ స్టోరేజీలో కేసు..

నాగపూర్ పోలీసులకు చిక్కిన ప్రభు, రవిలను ఆంధ్ర పోలీసులు ఆ తర్వాత రిమాండ్‌లోకి తీసుకున్నారు. వారిని పెనుకొండ కోర్టులో హాజరుపరిచారు. నిందితుల తరపున డిఫెన్స్ న్యాయవాదిగా రవికుమార్ కేసును వాదించారు. అయితే అప్పటిదాకా నిందితులను పట్టుకోవాలని ఉవ్విళ్లూరిన పోలీసులు హఠాత్తుగా చల్లబడిపోయారు. నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా వ్యతిరేకించలేదు. ఈ కేసులో కాల్పులు జరిపిన సీఐ గంగాధర రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. విచిత్రంగా ఈ రెండు కేసుల్లోను చార్జిషీట్లు నమోదు చేయలేదు.

చార్జిషీట్లు నమోదు చేయాలని, అసలు విషయం బయటకు చెప్పాలని కొందరు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. గత 18 ఏళ్లుగా ఈ కేసు కోల్డ్ స్టోరేజీలోనే ఉండిపోయింది. ఈ కేసుకు సంబంధించిన మొత్తం రికార్డులన్నింటినీ హైకోర్టుకు పంపేశామని, తమ వద్ద ఒక్క కాగితం కూడా లేదని పెనుకొండ కోర్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ట్రస్టు సభ్యులకు వ్యతిరేకంగా వాంగ్మూలం చెప్పిన ప్రభు, రవిల జాడ ఇప్పటికీ ఎవరికీ తెలియదు.

ఎన్నో అదృశ్యాలు

ప్రశాంతి నిలయంలో కొందరు ట్రస్టు సభ్యులు తిరుగులేని అధికారాన్ని చేపట్టి అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నారని.. అక్రమార్జనకు పాల్పడుతున్నారని- బ్రిటన్‌కు చెందిన సుమన్ సేన్ అనే ఒక భక్తుడు పుట్టపర్తిలో కొద్దికాలం కరపత్రాలు పంచిపెట్టాడు. బాబాకు కూడా అనేక వివరాలతో ఉత్తరాలు రాశాడు. ఇతనిపై పుట్టపర్తి పోలీసులు 1992 సంవత్సరం నవంబరు 18వ తేదీన (క్రైం నెంబర్ 151 సీఆర్‌పీసీ) ఒక కేసు నమోదు చేశారు. అతని జాడ కూడా ఎవరికీ తెలియదు. ఇలాంటి అదృశ్యాలు పుట్టపర్తిలో మామూలేననేది అనేకమంది అభిప్రాయం.

--

1 comment:

  1. full story at

    https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/may/1/main/1main3&more=2011/may/1/main/main&date=5/1/2011

    ReplyDelete