గంటలలో అయ్యేపనిని టెలిఫోన్ సాయంతో నిమిషాల్లో చేయవచ్చు. కానీ, తెలివిగా వాడకుంటే టెలిఫోన్ ఒక పెద్ద సమస్యగా మారుతుంది. మొబైల్ ఫోన్లు లేని కాలంలో కొన్ని కాల్స్ తప్పించుకునే వీలు ఉండేది. ఇప్పుడు ప్రతివాళ్ళ చేతిలోనూ ఒక ఫోన్ ఉంటుంది. ఎదురుగా ఉన్నవారు ఎంత ముఖ్యమైన మనుషులైనా, జరుగుతున్నది ఎంత ముఖ్యమైన చర్చ అయినా, ఫోన్ వచ్చిందంటే ధ్యాసంతా అటువేపు మళ్ళక తప్పదు. ఇంతాచేస్తే ఆ సంభాషణ ఎందుకూ పనికిరానిదై ఉంటుంది. అందుకే టెలిఫోన్ వాడకంలో కొన్ని నియమాలు ఉండాలి.
1. కాల్‌ను ముందే ప్లాన్ చేసుకోవాలి.
ఎవరికి కాల్ చేస్తున్నాం? ఎందుకు కాల్ చేస్తున్నాం? మాట్లాడవలసిన ముఖ్యమైన విషయమేంటి? ఈ ప్రశ్నలకు సరైన జవాబులు మనసులో ఉంటే, కాల్ నిడివి నిర్ణయమైపోతుంది. మనం తీరికగా ఉండి మిత్రులను ఊరికే పలకరించడానికి ఫోన్ పట్టుకున్నామనుకుందాం. అవతలివారు ఎంత తీరికగా ఉన్నారు? ఎవరిమధ్యన ఉన్నారు? ఎటువంటి మానసిక పరిస్థితిలో ఉన్నారు? మనకు ముందే తెలియదు. అనుకూలంగాని సమయంలో ఫోన్ చేస్తే ఎంతటి నేస్తాలైనా చిరాకు పడతారు. అందుకే ముందుగా ప్లాన్ చేసుకున్న కాల్స్ తొందరగా ముగుస్తాయి.
2. ఎక్కడ ఉన్నారు?
ఇదొక చ్యూయింగ్ గమ్ ప్రశ్నగా మారింది. మొబైల్ ఫోన్ గనుక మనం ఎక్కడఉన్నా జవాబు చెప్పగలుగుతున్నాం. కానీ, ఎక్కడ ఉన్నామన్నది ప్రశ్న కాదు. మాట్లాడడానికి వీలుందా? లేదా? అనేది ప్రశ్న! సాధారణంగా బిజీగా ఉండి, ‘నేను నీకు తిరిగి ఫోన్ చేస్తానులే!’ అంటాడు ఒక ఫ్రెండు. ఒకనాడు ఫోన్ చేస్తే ఢిల్లీలో ఉన్నాను తీరికగా మాట్లాడవచ్చు! అన్నాడు. కానీ, నాకు తీరిక ఉందా? లేదా అని అడగలేదు!
3. నేరుగా విషయానికి రావాలి!
బంధువులతో గానీ, మిత్రులతో గానీ, లేక వ్యాపారం, ఉద్యోగ సంబంధంగా గానీ, ఎవరితో మాట్లాడుతున్నా, అసలు విషయం గురించి ముందు ప్రకటించాలి.
ఫలానా సంగతి గురించి మాట్లాడాలి. ఇప్పుడు కుదురుతుందా? అని అడగడానికి మొహమాటం అడ్డురాకూడదు. 99 శాతం వరకు ఎవరూ ఎవరికీ ఊరికే కాల్ చేయరు. కానీ నేరుగా విషయం చెపితే మొరటుగా ఉంటుందని అందరమూ అనుకుంటాము. కనుక, ముందేవో ‘లైట్’ మాటలు మాట్లాడి, తర్వాత నెమ్మదిగా విషయానికి రావడం అలవాటుగా మారింది. లైట్ మాటలు కూడా అవసరమే. కానీ సమయం, సందర్భం కుదిరి ఉండాలి.
4. స్థలం, సందర్భం సరిగ్గా ఉండాలి.
మొబైల్ ఫోన్‌లు వచ్చిన తర్వాత కొత్త సమస్య ఒకటి పుట్టుకు వచ్చింది. ఎక్కడున్నామనేది గమనించకుండా నిజంగా ప్రైవేట్ విషయాలు గురించి పబ్లిక్‌గా మాట్లాడుతున్నారు. సందర్భం తెలుసుకుని సమయం కాదని చెప్పి, తర్వాత ఎప్పుడో మాట్లాడవచ్చు. ప్రయాణం సమయంలో పనేమీ ఉండదు గనుక లవ్ నుంచి మొదలు అన్ని సంగతులనూ, రేడియోలో లాగ అందరికీ ప్రసారం చేస్తున్నారు కొందరు! వాళ్లకు అభ్యంతరం లేకపోవచ్చు గానీ, వినేవారికి ఎంత ఇరకాటంగా ఉంటుందో ఊహించాలి.
5. తగిన సమయం ఏమిటి?
బిజినెస్ కాల్స్‌కు కొంత, సొంత కాల్స్‌కు కొంత ‘అనుకూలమైన’ టైం ఉండాలి. మనం తరుచుగా కాల్ చేయవలసిన వారికి, ఏ సమయం సరైంది? అని ముందే అడిగి తెలుసుకోవాలి. మనకు కాల్ చేసే వారికి కూడా మన టైమింగ్స్ గురించి చెప్పాలి. కొంత కాలానికి ఆ సమయం వచ్చిందంటే చాలు... కాల్ వస్తుందని ఎదురు చూచేదాకా వస్తుంది పరిస్థితి. ఇది ఇరువేపుల వారికీ, అనుకూలంగా ఉంటుంది.
6. రాంగ్ నంబర్ ప్లీజ్!
అది మామూలు ఫోన్ గానీ, మొబైల్ గానీ రాంగ్ నంబర్లు తప్పడం లేదు. మామూలుగా కాల్‌చేసే వారయితే, వాళ్ళ పేరు మొబైల్ ఫోన్లలో కనపడుతుంది. ‘అంకెలు కనబడ్డాయంటే అది అనుమానం కాల్ కింద లెక్క. తప్పుడు నెంబరుకు ఫోన్ చేయడం తప్పుకాదు. అందుకు ఏదో కారణం ఉంటుంది. నేను మీరనుకుంటున్న వ్యక్తిని కాదు అని చెప్పినా కొంతమంది ప్రశ్నలు అడుగుతుంటారు. రాంగ్ కాల్స్‌కు చేతయినంత గౌరవంగా ప్రశాంతంగా జవాబునివ్వాలి. చికాకు పడితే మన మూడ్ పాడవుతుంది తప్ప మరోటి లేదు. మనమయినా, కాల్‌చేసి, అవతలివ్యక్తి ఎవరో తేల్చుకోకుండా నేరుగా సంభాషణలోకి దిగకూడదు. గొంతు గుర్తించ గలిగితే ఫరవాలేదు. అందులోనూ చిక్కులుంటాయి. ఒక మిత్రునికి ఫోన్ చేసి, ‘ఏరా! గాడిదా? ఇంకా నిద్రలేవలేదా?’ అన్నాను. అవతలగొంతు ‘నిజమే! మీ గాడిద నిద్ర లేవలేదు. నేను నాన్న గాడిద, లేదా గాడిద నాన్నను’ అంది. నేను గతుక్కుమన్నాను!
7. ఇంకా ఏమిటి సంగతులు?
మాట్లాడవలసిన విషయం ముగుస్తుంది. మనకు కావలసిన సమాచారం దొరుకుతుంది. దొరకదు. అప్పుడు మరో చ్యూయింగ్ గమ్ ప్రశ్న! ఇంకా ఏమిటి? సంగతులు? అని ఈ ప్రశ్నకు మామూలుగా దొరికే జవాబు ఏముంటాయి? నీవే చెప్పాలి!’ అని, అడగగానే అదే జవాబు వస్తుందని తెలుసు. అయినా అడగవలసిందే!
మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత, మానవ సంబంధాలలో ఏరకంగా మార్పులు వచ్చిందీ, పరిశీలన జరగవలసి ఉంది. మనవాళ్ళు ఎక్కడున్నారు అన్న అనుమానం మాత్రం సులభంగా తీరుతున్నది. పోతే రకరకాల కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. ఫోన్ ఉండి కూడా జవాబు చెప్పకపోతే మాత్రం అపార్థాలు తప్పవు. సౌకర్యాన్ని సరిగ్గా వాడుకున్నంత సేపే, అది సౌకర్యం.!
--
good thoughts
ReplyDelete