Tuesday, 3 May 2011

ఒసామా బిన్ లాడెన్‌

ఒక సోమవారం

గత పదేళ్లుగా ఇక్కడున్నాడంటే ఇక్కడున్నాడంటూ ఎక్కడ చూసినా ఒసామా జపమే. అంతెందుకు హైదరాబాద్‌లో కూడా ఒక ఒసామా హల్‌చల్ చేశాడా మధ్య. మొత్తంమీద ఒసామా బిన్ లాడెన్ పోలికలతో ఉన్న వాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని తేలింది. ఇంతటి ప్రాచుర్యం పొందిన ఒసామా మరణించాడని తెలిసిన గంట తరువాత "ఒసామా బిన్ లాడెన్‌లా చాలామంది ఉన్నప్పుడు మరణించింది నిజమైన ఒసామానే అనడానికి సాక్ష్యమేమిటి?'', "అఫ్‌కోర్సు డిఎన్ఎ టెస్ట్ చేశామంటున్నారు.'' "అయితే అవి ఒసామా నుంచి సేకరించిన ఒరిజినల్ శాంపిల్సే అని నమ్మకమేంటి?'' అంటూ ఎన్నో అనుమానాలు వెబ్‌ప్రపంచంలో వెల్లువెత్తాయి. దీనికి కారణం గతంలో ఎందరో ఒసామాలను మనం చూసి ఉండడమే. వాళ్లలో కొందర్ని గుర్తు చేసుకుందాం ఇవ్వాళ...
దరో లాడెన్‌లు!
బీహార్‌లో ఒసామా
జనవరి 19, 2005

బీహార్‌లో 2005లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు రామ్ విలాస్ పాశ్వాన్ ఒసామాని పక్కన పెట్టుకుని మరీ ప్రచారం చేశాడని తెలుసా మీకు! ఒసామా అంటే మరీ ఒసామా కాదు. అచ్చం ఒసామాలా ఉండే మౌలానా మీరజ్ ఖలీద్ నూర్‌ను వెంటపెట్టుకుని ప్రచారం చేశారు పాశ్వాన్. మైనార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు అంతర్జాతీయ ఉగ్రవాదిని వాడుకోవడం ఎలా ఆమోదయోగ్యం అని పాశ్వాన్‌ని అడిగితే "మీ ముఖం కూడా సద్దాం హుస్సేన్‌లా, లేదా ఒసామా బిన్ లాడెన్‌లా ఉంటే మీరేం చేస్తారు? మీరజ్ ఖలీద్ నూర్ ముఖం ఒసామాలా ఉంటుంది.

అంతమాత్రాన ఒసామా అయిపోతాడా? మీరజ్ నాకు అత్యంత సన్నిహితుడైన మిత్రుడి కొడుకు. అతని తండ్రీ, నేనూ ఒకేసారి సోషలిస్టు పార్టీలో చేరాం. మా ఇద్దరిదీ దీర్ఘకాల స్నేహబంధం. అందుకే ఆయన కొడుకుని ప్రచారానికి తీసుకొచ్చాను'' అంటూ విసుక్కున్నాడు. ఒకేలా ఉన్నంత మాత్రాన ఒసామా అయిపోతాడా అని పాశ్వాన్ చిర్రుబుర్రులాడారు కాని ఒసామా వలె ఉన్న కారణంగా జీవనాధారం పోగొట్టుకున్నాడు ఒకాయన.

పొట్టకొట్టిన పోలిక
జనవరి, 11/2006

ఆస్కార్ బ్రూఫని అనే 52 యేళ్ల పెద్దమనిషి జీవితాన్ని దుర్భరం చేసింది ఆయనకున్న ఒసామా ముఖమే. బ్యునస్ ఎయిర్స్‌లో బంగాళాదుంప చిప్స్ అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవాడు ఆస్కార్. ఆయన జీవితం 2004 అక్టోబరు వరకు బాగానే ఉంది. కాని ఆ తరువాతే అదృష్టం తిరగబడింది. లా ప్లాటాలోని వాల్‌మార్ట్‌లో సరుకు అన్‌లోడింగ్ అయిపోయి డెలివరీ రిపోర్టు కోసం ట్రక్ దగ్గర ఎదురుచూస్తున్నాడు ఆస్కార్.

ఎంతకీ స్టోర్ మానేజర్ ఆయనకి రశీదు ఇవ్వలేదు. ఆవిడ ఏం చేస్తోందా అని చూస్తే యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన ఇద్దరు వాల్ మార్ట్ కంట్రోలర్లతో మాట్లాడుతూ కనిపించిందామె. ఆ తరువాత కొంతసేపటికి "నువ్వు ఇక్కడ పనిచేయడానికి వీల్లేదంటూ ఆర్డర్ వచ్చింది అంది'' తానేం తప్పు చేశానో తెలియని ఆస్కార్ అదే విషయాన్ని అడిగాడు. దానికి సమాధానంగా "నువ్వు ఒసామా బిన్‌లాడెన్‌లా ఉన్నావు. సెక్యూరిటీ కెమెరాల్లో నీ ఫోటో రికార్డు అయితే నా ఉద్యోగం పోతుంది. అందుకే నువ్వు ఈ సరిసర ప్రాంతాలకు రాకు'' అని చెప్పింది.

ఆస్కార్‌కి చిప్స్ సరఫరానే జీవనాధారం కావడంతో ఎన్నోసార్లు వాల్‌మార్ట్ స్టోర్‌లోకి వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ వీలు కాలేదు. ఎప్పటికయినా వాళ్లు మారకపోతారా అని ఒక డ్రైవర్‌ని పెట్టుకుని ఆస్కార్. డాష్‌బోర్డు కిందకు తలదూర్చి దాక్కుని డెలివరీ ఎలా చేయాలో అతనికి చెప్పేవాడాయన. కాని ఎన్నాళ్లలా దాక్కుని తిప్పలు పడతాడు! చూసి చూసి విసుగొచ్చి వాళ్లు మారరని కోర్టులో కేసు వేసాడు. ఈలోగా వేరే స్టోర్స్ వాళ్లు ఆస్కార్‌కు ఆహ్వానం పలికినా ఒసామా పోలికలు తన పొట్ట కొట్టాయని వాపోతుంటాడు ఆస్కార్.

రెండుసార్లు అరెస్టు
ఏప్రిల్ 30, 2007

అఫ్ఘానిస్తాన్‌కు చెందిన ఆదివాసి ఒకడు అచ్చం ఒసామాలా ఉండడం వల్ల రెండుసార్లు అరెస్టు అయ్యాడు. ఆరడుగుల పొడవుతో ఉండే ఇతని ముక్కు అచ్చం లాడెన్ ముక్కులాగానే ఉంటుంది. ఆయన పేరు షేర్ అక్బర్. బాగ్ ఎ మెటల్ ప్రాంతానికి చెందినవాడు. అక్కడే బిన్ లాడెన్ దాక్కున్నాడని అమెరికా నిఘా వర్గాలు భావించేవి. బిన్‌లాడెన్ ఆరడుగుల నాలుగున్నర అంగుళాల ఎత్తు, 160 పౌండ్ల బరువుతో ఉన్నాడనేది నిఘా వర్గాల అంచనా.

పాకిస్తాన్ సరిహద్దులోని చిత్రాల్ పరిసర ప్రాంతాల్లో లాడెన్ తిరుగుతున్నాడని సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి షేర్ అక్బర్‌ను అరెస్టు చేశారు. ఇలా జరగడానికి కారణం బిన్‌లాడెన్ పేరు మీద 25 మిలియన్ డాలర్ల రివార్డు ఉండడమే. దాంతో లాడెన్‌ను పోలిన వ్యక్తి కనిపిస్తే చాలు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం చేరిపోయేది. అలా అక్బర్ రెండుసార్లు అరెస్టయ్యాడు. కొలంబియాను కూడా వదల్లేదు ఒసామా. కాకపోతే ఇక్కడ ఒసామా చాలా బాగా ఉపయోగపడ్డాడులెండి....

పహారాతో పరార్...
జనవరి 31, 2008

ఫెర్నాండో అనే కొలంబియన్ సెక్యూరిటీ గార్డు. శాంటా ఫె జిల్లాలో ఉద్యోగం చేస్తుండేవాడు. ప్రమాదకరమైన నేరాలకు ప్రసిద్ధి ఆ ప్రాంతం. మాదకద్రవ్యాల వ్యాపారం, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెెట్టడం ఎలా అని ఆలోచించే ఫెర్నాండోకు 9/11 దాడుల తరువాత మాంఛి ఆలోచన వచ్చింది. అల్ ఖైదా నాయకుడు ఒసామా వేషంలో తిరిగితే నేరాలను కొంతవరకయినా అదుపు చేయొచ్చనుకున్నాడు. ఆలోచన రావడం ఆలస్యం అక్కడి పోలీసుల సాయంతో ఒసామాగా మారిపోయాడు ఫెర్నాండో.

"కొన్ని కుక్కలను వెంటపెట్టుకుని రాత్రిళ్లు పహారా తిరగడం నా పని. నన్ను ఒసామా అనే పిలవమనే వాడ్ని. చాలామందే భయపడే వాళ్లు. నా ఎనిమిదినెలల వయసులో అమ్మను, నన్ను వదిలేసి వెళ్లిపోయాడు మా నాన్న. నాకు సంబంధించినంత వరకు ఆయనే ఒసామా'' అంటాడు ఫెర్నాండో. ఈ చిట్కా బాగానే పని చేసినట్టుంది. ఇతను ఉన్నంతకాలం మాకు భయం లేదనే ధీమా వ్యక్తం చేశారు అక్కడి ప్రజలు. ఒసామా వల్ల చెడే కాదు మంచి కూడా జరిగిందన్నమాట. అందుకే కాబోలు నాణేనికి మరో వైపు అంటారు. మనుషులే కాదు సినిమాలనూ వదల్లేదు ఒసామా బిన్ లాడెన్.

వదల బొమ్మాళీ...
జూలై 15, 2010

'తేరే బిన్ లాడెన్' అనే సినిమాలో పాకిస్తానీ జర్నలిస్టు యునైటెడ్ స్టేట్స్ వెళ్లేందుకు పడే తిప్పలుంటాయి. ఇదో కామెడీ సినిమా. జర్నలిస్టు పాత్రలో పాప్ సింగర్ అలీ జాఫర్ నటించాడు. ఈ పాత్ర నకిలీ ఒసామా బిన్ లాడెన్‌ను ఇంటర్వ్యూ చేస్తుంది. ఇదంతా హాస్యంగా చిత్రించామని చిత్ర యూనిట్ అన్నా దీనిలో హాస్యం ఏమీ లేదంటూ పాకిస్తాన్ సెన్సార్ బోర్డు అనుమతివ్వలేదు. అసలైనా, నకిలీ అయినా లాడెన్ లాడెనే. ఆయన పేరు వాడడానికి వీల్లేదన్నారు.

No comments:

Post a Comment