Tuesday, 3 May 2011

'ఆపరేషన్ ఒసామా'..లాడెన్ గుట్టు.. కొరియర్‌తో రట్టు

లాడెన్ గుట్టు.. కొరియర్‌తో రట్టు
నాలుగేళ్లుగా కొరియర్‌పై నిఘా
ఆగస్టు నుంచి నివాసంపై కన్ను

డిటెక్టివ్‌ల ద్వారా సమాచార సేకరణ
గత నెలలోనే లాడెన్ ఆచూకీపై నిర్ధారణ
'ఆపరేషన్ ఒసామా' సాగిందిలా... 

న్యూయార్క్, మే 2: కొండలు తిరిగారు. గుట్టలు చుట్టుముట్టారు. గుహల్లో వెతికారు! ఒసామా బిన్ లాడెన్ ఎక్కడా దొరకలేదు! చివరికి... పాకిస్థాన్ రాజధాని సమీపంలో... విలాసవంతమైన భవంతిలో లాడెన్ హతమయ్యాడు. అసలు లాడెన్ ఇక్కడే ఉన్నట్లు అమెరికా నిఘా కంటికి ఎలా తెలిసిందంటే...

గ్వాంటనామా బేలోని ఖైదీల నుంచి అమెరికా రకరకాల సమాచారాన్ని రాబడుతోంది. ఈ క్రమంలో లాడెన్‌కు అత్యంత విశ్వసనీయుడైన ఒక కొరియర్ గురించి తెలిసింది. ఆ కొరియర్ అసలు పేరు మాత్రం తెలియలేదు. నాలుగేళ్ల క్రితం అసలు పేరు కూడా తెలిసింది. అప్పటి నుంచి ఆ కొరియర్ ఆచూకీ కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. చివరికి... గత ఏడాది ఆగస్టులో అతని నివాసాన్ని కూడా కనిపెట్టారు. అబోత్తాబాద్ శివార్లలో ఆ కొరియర్ నివసిస్తున్నట్లు గుర్తించారు.

అది... విశాలమైన, విలాసవంతమైన భవంతి. దాని చుట్టూ 12 నుంచి 18 అడుగుల ఎత్తైన కాంక్రీట్ గోడ. ఆ గోడపై ఇనుప కంచె! ఇలాంటి భవంతిలో కేవలం ఒక కొరియర్ ఉండడని, అంతకంటే 'ముఖ్యమైన' వారెవరో ఉంటారని అమెరికా అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. 'ఆపరేషన్ ఒసామా' మొదలుపెట్టారు. అమెరికా నిఘా విభాగం సీఐఏ నిపుణులు సుమారు రెండు నెలలపాటు ఆ భవంతిపై ఉపగ్రహాల ద్వారా కన్నేశారు. ఫొటోలు తెప్పించుకున్నారు.

2005లో 'ఒక ప్రత్యేక అవసరం' కోసమే ఆ భవనాన్ని నిర్మించినట్లు అంచనాకు వచ్చారు. ఈ భవన నిర్మాణానికి సుమారు 45 లక్షల రూపాయలు వెచ్చించినట్లు తేల్చారు. ఆ ఇంటికి టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్‌లు లేవు. టీవీ కూడా లేదు. ఆ ఇంట్లో వాళ్లు అందరిలాగా చెత్తా చెదారం తీసుకొచ్చి బయట పడేయడంలేదు. బయటి వారు కూడా చెత్తను సేకరించేవారు కాదు. చెత్తను ఇంటి ఆవరణలోనే కాల్చేసేవారు. ఇంటిలోపలికి వెళ్లేందుకు రెండు గేట్లు మాత్రం ఉన్నాయి. సీఐఏ నియమించిన డిటెక్టివ్‌లు ఈ మొత్తం సమాచారాన్ని సేకరించారు.

చివరికి... ఆ ఇంట్లో ఉన్నది లాడెన్, అతని కుటుంబమే అని గత నెలలో ఒక స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధ్యక్షుడు ఒబామాకు చేరవేశారు. 'అక్కడ లాడెన్ ఉన్నట్లు తేలితే ఏం చేయాలి?' అనే అంశంపై ఒబామా గతనెల 14న కీలక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఇలాంటి సమావేశాలు మరో నాలుగు జరిపారు. ఏప్రిల్ 29న 'కిల్ ఒసామా బిన్ లాడెన్' ఆదేశాలపై ఒబామా సంతకం చేశారు. ఆదివారం 'ఆపరేషన్ ఒసామా' విజయవంతంగా పూర్తయింది.

No comments:

Post a Comment